చేతులు, కాళ్ళలో జలదరింపు ఉంటోందా? ఈ విటమిన్ లోపం ఉన్నట్టే..!
posted on Oct 8, 2025 @ 11:50AM
కొంతమంది కూర్చొన్నప్పుడు, పడుకున్నప్పుడు చేతులు లేదా కాళ్ళలో జలదరింపుగా ఉంటుందని కంప్లైంట్ చేస్తుంటారు. ఇది సాధారణంగా ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నరాల కుదింపు వల్ల సంభవిస్తుంది, ఇది కాలక్రమేణా తగ్గిపోతుంది. అయితే ఇలా జలదరింపు ఉండటాన్ని పదే పదే.. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అనుభవిస్తుంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
జలధరింపుకు కారణం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక ముఖ్యమైన విటమిన్ అయిన విటమిన్ B12 లోపానికి ప్రారంభం కావచ్చని అంటున్నారు. ఈ విటమిన్ మన నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ బి12 లోపం నరాలు శాశ్వతంగా నష్టానికి గురికావడానికి కారణమవుతుంది.
విటమిన్ బి12 లోపిస్తే..
చేతులు, కాళ్ళలో జలదరింపు ఇతర వ్యాధులకుకు కూడా సంకేతంగా ఉంటుంది. వీటిలో మధుమేహం, విటమిన్ బి12 లోపం, నరాల నొప్పి, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, థైరాయిడ్, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి. అయితే చాలా సందర్భాలలో ఇది విటమిన్ బి12 లోపం వల్ల ఎక్కువగా వస్తుంది.అసలు విటమిన్ బి12 లోపం లక్షణాలు ఎలా ఉంటాయో పూర్తీగా తెలుసుకుంటే..
విటమిన్ బి 12 ఎందుకు ముఖ్యమైనది?
విటమిన్-బి12 ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరానికి అవసరమైన పోషకం. దీని ప్రాథమిక విధి నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వాటిని రక్షించే మైలిన్ తొడుగును ఏర్పరచడం. ఇది శరీరమంతా ఆక్సిజన్‌ను మోసుకెళ్ళే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 లోపం నాడీ వ్యవస్థను, రక్తాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.
విటమిన్ బి12 లోపం ఇతర లక్షణాలు..
విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు చేతులు, కాళ్ళలో జలదరింపు లేదా తిమ్మిరి మాత్రమే కాకుండా శరీరంలో ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.
చాలా అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు తడబడటం లేదా బాలెన్స్డ్ గా ఉండలేకపోవడం జరుగుతుంది. తరచుగా నోటి పూతలు, లేదా నోరు, నాలుక ఎర్రగా మారడం జరుగుతుంది.
చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం లేదా చిరాకుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
విటమిన్-బి12 లోపం ఎవరికి వచ్చే ప్రమాదం ఎక్కువ..
శాఖాహారులు విటమిన్ బి12 లోపం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ విటమిన్ సహజంగా మాంసాహార ఆహారాలైన మాంసం, చేపలు, గుడ్లు వంటివాటిలో ఎక్కువ. అలాగే పాల ఉత్పత్తులలో కూడా ఉంటుంది. వృద్ధులలో కడుపులో జీర్ణరసాలు తగ్గడం వల్ల పోషకాల శోషణ తగ్గవచ్చు. జీర్ణ వ్యాధులైన క్రోన్'స్ వ్యాధి వంటివి ఉన్నవారికి కూడా విటమిన్ బి12 లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పరిష్కారమేంటి..?
మాంసాహారులైతే, గుడ్లు, చేపలు, మాంసాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. శాఖాహారులు పాలు, పెరుగు, జున్ను, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, ఈస్ట్, సప్లిమెంట్ల ద్వారా శాకాహారులు విటమిన్-బి12 పొందవచ్చు. పైన పేర్కొన్న లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. విటమిన్-బి12 లోపాన్ని గుర్తించడానికి ఒక సాధారణ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష అనంతరం విటమిన్-బి12 లోపం ఉంటే.. ఆహారం, సప్లిమెంట్లు సూచిస్తారు.
*రూపశ్రీ.