అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు.. గుడివాడ అమర్నాథ్
posted on Sep 3, 2022 @ 10:35AM
కోర్టు తీర్పులు, ప్రజల ఆకాంక్షలు పట్టని నేతలు తాము చెప్పిందే వేదమని అంటారు. అనడమే కాదు అదే నమ్ముతారు. ఎవరేమన్నా, ఎన్ని విధాలుగా తప్పుపట్టినా వారికి పట్టనే పట్టదు. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కూడా అదే వరుసకు చెందుతారు.
ఒక వైపు కోర్టు మొట్టి కాయలు, మరో వైపు అమరావతి రైతుల ఆందోళన ఇవేమీ పట్టించుకోకుండావచ్చే ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ఖాయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం(సెప్టెంబర్ 2) విలేకరులతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను జైలుకు పంపాలన్నారు.
వారిరువురూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 90 శాతం నెరవేర్చామన్న గుడివాడ అమర్నాథ్.. అయినా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తామెక్కడా చెప్పలేదన్న కొత్త వాదనకు తెరలేపారు.
విభజన హామీలను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబుకు జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానులపైనే చర్చ ఉంటుందన్నారు. బల్క్ డ్రగ్ ప్రాజెక్టును చంద్రబాబు వ్యతిరేకించడాన్ని మంత్రి అమర్నాథ్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు.