బీహార్ సీఎం నితీష్ కు షాక్.. మణిపూర్ లో జేడీయూ ఖాళీ
posted on Sep 3, 2022 @ 10:20AM
బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. మణిపూర్ లో జేడీయూకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలూ కమలం గూటికి చేరారు. వారు ఆరుగురూ బీజేపీలో విలీనం కావడంతో మణిపూర్ అసెంబ్లీలో జేడీయూ ఖాళీ అయ్యింది.
దీనిపై బీజేపీ నాయకుడు, ఎంపీ సుశీల్ మోడీ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు జేడీయూ ముక్త గా మారుతున్నాయని ట్వీట్ చేశారు. కాగా మణిపూర్ లో జేడీయూ ఎమ్మెల్యేల విలీనాన్ని స్పీకర్ వెంటనే ఆమోదించారు. బీజేపీ నేత, ఎంపీ సుశీల్ మోదీ ట్వీట్ చేస్తూ.. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ‘జేడీయూ ముక్త్’గా మారుతున్నాయని సెటైర్ వేశారు. నితీష్ కుమార్ కు ఇలా ఎదురు దెబ్బ తగలడం పది రోజుల వ్యవధిలో ఇది రెండో సారి.
గత నెల 25న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే టెకి కసో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2019లో అరుణాచల్ ప్రదేశ్లో జేడీయూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధించినా, ఆ తర్వాత ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరిపోయారు.
ఇప్పుడు అంటే గత నెల 25న ఆ మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరడంతో అరుణాచల్ అసెంబ్లీలో జేడీయూకి ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. తాజాగా మణిపూర్ లో కూడా ఆ పార్టకి చెందిన ఆరుగురూ కమలం గూటికి చేరడంతో ఆ రాష్ట్రంలోనూ జేడీయూ ఖాళీ అయిపోయినట్లైంది.