ఈ స్నేహం తెగని బంధం!
posted on Oct 21, 2022 @ 11:43AM
లోకంలో స్నేహాలు చిత్రంగా ఉంటాయి. మనిషికి జంతువులకి, మనిషికి పక్షులకీనూ! వాటి విశ్వాసం, స్నేహం పోని తెంచలేని సంబంధాలు అర్ధంకావు. వాటి మనసులో మాట చెప్పలేవు..స్నేహం చేస్తున్న వారికే తెలియాలి. పక్షులు మాట్లాడతాయంటారు.. ఎలా? అన్నది ఆ స్నేహితులే చెప్పగల్గుతారు. రోజూ గింజలు తినడానికి వచ్చే పావురం ఒక్కరోజు రాకుంటే పెద్దాయన ఆలోచనలో పడతాడు, మంచినీళ్లు తాగడానికీ ఆలోచిస్తాడు..అరే ఇది ఇవాళింకా రాలేదే అనుకుంటాడు! అదీ అంతే కిటికీ ఊచలకు ఊగు తూ .. ఈ ముసలాయన ఇంకా కనపడలేదే అనీ అనుకుంటుంది..హాస్యం కాదు.. వారి స్నేహంలో అదో అందం.. చూసి తీరాలంతే!
తనకే దిక్కులేదు ఇదొకటి నా వెంటే పడుతోందనుకోలేదు చిన్న కుక్కపిల్లతో బిచ్చగాడు. కానీ మధ్యా న్నం అయ్యేసరికి కనీసం ఒక ముద్ద దానికీ పెట్టడంతో వదల్లేదు. ఆ బిచ్చగాడు చనిపోతే చొక్కాతో పట్టి లాగి కాస్తంత నీడగా ఉన్న బస్టాప్‌లో పడేసి వీడి సంగతి చూడమని రోడ్డునపోయేవారికి మొరిగి మొరిగి మరీ చెప్పింది. . అదీ విశ్వాసం. తర్వాత అదీ రెండేళ్లకి యాక్సిడెంట్‌లో చనిపోయింది, సరిగ్గా దానికి అన్నం పెట్టిన వాడు చనిపోయిన చోటే!
మనం తినేటపుడు రెండు గింజలు పడేస్తే పక్షులూ అదే సమయానికి పనిగట్టుకుని వస్తూంటాయి. అదేదో నగరంలో పక్షుల రాజా అనేవాడుండేవాడు. అతని పేరు ఎవ్వరికీ తెలీదు. పావురాలన్నీ మధ్యాన్నానికి అతని దగ్గరి వచ్చి చేరతాయి. తలమీద డాన్స్ చేస్తాయి. అతను గట్టిగా నవ్వుకుంటాడు. జేబులోంచి పది గింజలు విసిరితే అవి తినేసి వాటిపళాన అవి ఎగిరిపోతాయి.. అతను తృప్తిగా నవ్వుకుంటాడు. ఇది చిత్రంగా ఉండవచ్చు. కానీ అదో స్నేహబంధం..త్వరగా అందరికీ అర్ధం కాదు.
శ్రీలంక బట్టికలోవాలో ఒక వ్యక్తి ఒక కొండముచ్చుకి రోజూ కాస్తంత తిండి పెట్టేవాడు. వారి స్నేహం కుది రి దింది. రోజూ తిండి పెట్టేవాడు. అతను ఈమధ్యనే మరణించాడు. ఆ రోజు అతని బంధువులు, తెలిసిన వారూ ఎంతో బాధపడ్డారు, శవం ఇంటిముందు పెట్టారు. అంతలో ఒక్క ఉదుటున వచ్చింది అతని స్నేహితురాలు పెద్ద కొండముచ్చు. ఎంతో బాధపడుతూ చేత్తో గుండెల మీద కొడుతూ లేపడానికి ప్రయ త్నించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటివి అరుదే.. కానీ ఆ బంధం అంతటితో తెగిపోదు.