తిరుమల లడ్డు తయారీ పోటులో ప్రమాదాలకు కొత్త టెక్నాలజీతో అడ్డుకట్ట
posted on Dec 16, 2019 @ 12:00PM
తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులు.. దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యత లడ్డూ ప్రసాదానికే ఇస్తారు. దీంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం అత్యంత ప్రియంగా మారిపోయింది. లడ్డూ ప్రసాదాల విక్రయం రోజూ 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. ఆగమశాస్త్రం ప్రకారం స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఆలయంలోనే తయారు చేయాలి. పోటులో నిత్యం లక్ష నుంచి లక్షా ముప్పై వేల లడ్డూలు తయారు చేస్తున్నారు. లడ్డూ తయారీని పెంచేందుకు మధ్యే మార్గాన్ని టిటిడి అనుసరిస్తోంది. బూందీ తయారీని నిలుపుదల చేసి తిరిగి ఆలయంలోకి బూందీని తరలించి లడ్డూ ప్రసాదాలు తయారు చేసేలా ఏర్పాట్లు చేసింది. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వైష్ణవులే తయారు చేయాలి. వైష్ణవులు అంతగా ఆసక్తి చూపక పోవటంతో సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో బూందీ పోటులో మూడు వరుసల్లో 49 స్టవ్ లు ఉంచి ఉన్న సిబ్బంది తోనే అదనపు పనివేళలు కేటాయించి ప్రసాదాలు తయారు చేస్తోంది. నిరంతరం లడ్డూలు తయారు చేయడం, సిబ్బంది కొరత, అదనంగా విధులు నిర్వహిస్తుండటంతో బూందీ పోట్ పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం కష్టంగా మారుతోంది. బూందీ కారణంగా అటు గోడలతో పాటు పైకప్పులో భారీగా జిడ్డు పెరిగిపోతోంది. సిబ్బంది నెయ్యి పోసే సమయంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నెయ్యి ఆవిరిగా మారి ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతున్నాయి. సిబ్బంది అప్రమత్తంగా ఉండటం వల్ల భారీ ప్రమాదాలు చోటుచేసుకోకపోయినా శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే పోటులో ప్రమాదం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీంతో అగ్నిప్రమాదాల్ని అరికట్టటానికి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాస్ క్లీనింగ్ నిర్వహిస్తున్నా కూడా.. పైపుల్లో పేరుకుపోతున్న జిడ్డుతో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
భక్తులతో పాటు మఠాధిపతులు టిటిడి నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు జూన్ లో అధునాతమైన థెర్మిక్ ఫ్లూయిడ్ ద్వారా నడిచే స్టవ్ లను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. 28 లక్షల రూపాయల వ్యయంతో రెండు స్టవ్ లను బూందిపోటులో ఉంచి పరిశీలించారు ఇంజినీరింగ్ అధికారులు. ఈ స్టౌలు ద్వారా మంటలు బయటికొచ్చే అవకాశం లేకపోవటం వేడి కూడా బయటికి రాకపోవడంతో సిబ్బంది కూడా ఎంతో సౌకర్యవంతంగా లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ పోటులో పూర్తిస్థాయిలో థెర్మిక్ ఫ్లూయిడ్ ద్వారా నడిచే స్టవ్ లు ఏర్పాటు చేయటంలో టీటీడీ నిర్లక్ష్యం వహించింది. అయితే గత ఆదివారం తిరిగి పోటులో అగ్ని ప్రమాదం జరగడం అటు భక్తులతో పాటు ఇటు మఠ పీఠాధిపతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. పొరపాటును గుర్తించిన టిటిడి అధికారులు కోర్టులో ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయిలో థెర్మిక్ ఫ్లూయిడ్ స్టవ్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తద్వారా ప్రమాదాలకు చెక్ పడడమే కాకుండా సిబ్బందికీ ఇక్కట్లు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. టిటిడి అధికారులు థెర్మిక్ ఫ్లూయిడ్ ద్వారా నడిచే స్టవ్ లు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటే అన్ని సవ్యంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు శ్రీవారి భక్తులు.