ఉత్తమ పోలీస్ స్టేషన్.. నెం.1గా నిలిచిన చొప్పదండి పీఎస్
posted on Dec 16, 2019 @ 11:40AM
కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో చొప్పదండి మండల పోలీసు స్టేషన్ ఉంటుంది. చెట్లు, ఇంకుడు గుంత పరిశుభ్రమైన వాష్ రూమ్ ఇలా పీఎస్ ఇంటి వాతావరణాన్ని తలపిస్తుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజల అవసరాలు తీరుస్తుంది, సత్వర న్యాయం చేస్తుంది. అందుకే జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లా కమిషనరేట్ అయ్యాక చొప్పదండి పోలీస్టేషన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన జాబితాలో ఉత్తమ పోలీసింగ్ విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా చొప్పదండి స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచింది. ఉత్తమ సేవలు కనబరిచిన పీఎస్ లకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది గుర్తింపు ఇస్తుంది. ఆన్ లైన్ వేదికగా పోటీలు నిర్వహిస్తుంది. పీఎస్ లకు పాయింట్లను కేటాయిస్తుంది. రెండు విడతలుగా చేపట్టే సర్వేలో ప్రధానంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం సేవలలో మెరుగైన పనితీరు కనబరిచిన చొప్పదండి పోలీస్టేషన్ అర్హత సాధించింది. దేశంలో 15,660 పోలీసు స్టేషన్ లు ఉండగా వాటిలో ఉత్తమ పోలీస్ స్టేషన్ ల ఎంపికను కేంద్ర హోంశాఖ చేపట్టింది. అందులో 77 స్టేషన్ లను షార్ట్ లిస్ట్ చేసి టాప్ 10 స్టేషన్ ల ఎంపిక కోసం కేంద్ర హోంశాఖ సర్వే నిర్వహించింది. మొదటి విడతలో 30 శాతం మార్కులతో ముందు వరుసలో నిలవగా, రెండో సర్వేలో 70 శాతం మార్కులతో తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకుంది చొప్పదండి పోలీసు స్టేషన్. ఉత్తమ పోలీసు స్టేషన్ ఎంపిక సర్వే లో పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. స్టేషన్ లో కంప్లైంట్లు ఆన్ లైన్ చేసే విధానం రికార్డుల అప్ డేట్ స్టేషన్ పరిసరాల్లో చేపడుతున్న గార్డనింగ్ పనులు, దివ్యాంగులకు సౌకర్యాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, రిసెప్షన్ కౌంటర్, సిబ్బంది నడవడిక, క్రైం జరిగిన వెంటనే డిటెక్ట్ చేసే విధానాల ఆధారంగా చొప్పదండిని ఎంపిక చేశారు. మొత్తంగా చొప్పదండి పీఎస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని మిగతా పీఎస్ లు కూడా చొప్పదండి ఫాలో అయ్యే పనిలో పడ్డాయి.