Read more!

ఉత్సాహం.. విశ్వాసం జీవితంలో ఎందుకు ముఖ్యమంటే!

ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోకుండా, సాహసోపేతంగా జీవిస్తూ ముఖంపై చిరునవ్వులు చెదరనీయకుండా ఉండగలుగుతున్నామంటే మన వ్యక్తిత్వం వికసించిందన్నమాటే! దృఢమైన వ్యక్తిత్వం కలిగినవాళ్ళు అప్రమత్తంగా ఉంటారు, అలా అని అతిజాగ్రత్తను ప్రదర్శించరు. కచ్చితంగా ఉంటారు, అలా అని మూర్ఖంగా ఆలోచించరు. పట్టుదలగా ఉంటారు, అలా అని మొండిపట్టుగా ఉండరు. సరదాగా ఉంటారు, అలా అని చౌకబారుగా ప్రవర్తించరు. ఏ స్థానంలో ఉన్నా ఇలాంటి కొన్ని మౌలికలక్షణాలను అలవరచుకుంటే మన నడవడిక నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. మూడు మాటల్లో చెప్పాలంటే ఉల్లాసం... ఉత్సాహం... విశ్వాసం ముప్పేటలా అల్లుకున్నదే జీవనసూత్రం! నిజమైన జీవనసూత్రం..

ఉల్లాసం... 

 నిరంతరం దీర్ఘాలోచనలతో, ముభావంగా ఉండేవారు జీవితంలో ఏమీ సాధించలేరు. ముఖ్యంగా యుక్తవయస్సులో భవిష్యత్తుకు ఒక ప్రణాళిక రచించుకునే కాలంలో శారీరకంగా, మానసికంగా ఉల్లాసం తొణికిసలాడాలి. నలుగురితో సరదాగా, కలివిడిగా కలసిపోవాలి. అందుకే "ఆధ్యాత్మికంగా పరిణతిని సాధించిన వ్యక్తి ఎల్లప్పుడూ ఆహ్లాదంగా, ఆనందంగా కనిపిస్తాడు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండేవారు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లే!" అంటారు స్వామి వివేకానంద. నేడు సమాజంలో కూడా గొప్పగొప్ప విజయాలు సాధించినవారందరూ తమతో పాటు తమ పరిసరాల్ని కూడా ఆహ్లాదభరితంగా ఉంచుకుంటారు. అలాగని నలుగురిలో వెకిలిగా ప్రవర్తించడం సమంజసం కాదు. హుందాగా ఉంటూనే, చిరునవ్వును ఆభరణంగా ధరిస్తూ కనిపించాలి. ఫలితంగా ఎంతటి ఒత్తిళ్ళనైనా సునాయాసంగా అధిగమించవచ్చు. ఎదుటివారితో సామరస్యంగా పని చేయించుకోవచ్చు.

ఉత్సాహం... 

విద్యార్థి దశలో కానీ, ఉద్యోగిగా బాధ్యత నిర్వహణలో కానీ, ఉత్సాహంగా ఉపక్రమించకపోతే ఉత్తమ ఫలితాలు రావు. ఉత్సాహంగా ఉండేవ్యక్తులే సమాజాన్ని ఆకర్షించగలరు. నలుగురితో  సంబంధాలను కొనసాగించగలరు. Sportive Attitude పెంపొందించుకోగలరు. అలాంటివారు ఎలాంటి పని ఒత్తిళ్ళకూ లోనుకారు. అందుకే ఆస్కార్ వైల్డ్ 'కొందరు ఎక్కడికి వెళితే అక్కడ ఆనందాన్ని కలిగిస్తారు, మరికొందరు అక్కడి నుండి ఎప్పుడు వెళితే అప్పుడు ఆనందం కలుగుతుంది' అంటారు. అందుకే ఉత్సాహంతో, సంతోషంతో మొదటి రకం వ్యక్తుల్లా ఉండేందుకు ప్రయత్నించాలి.

విశ్వాసం…

 ఒక ఊరిలో ఓ ఏడాది తీవ్ర కరవుకాటకాలు సంభవించాయి. గ్రామస్థులంతా కలసి సమీప ఆలయంలో సాధనలు చేస్తున్న సాధువును ఆశ్రయించారు. తమ గ్రామాన్ని వరుణుడు కరుణించేట్లు ప్రార్థించమని ఊరి ప్రజలంతా ఆ సాధువుని వేడుకున్నారు. వారి వేడుకోలుకు స్పందించిన సాధువు "మీ గ్రామం కోసం తప్పకుండా ప్రార్థనలు చేస్తాను. రేపు ఉదయం అందరూ ఈ ఆలయానికి రండి ప్రార్థనలతో వర్షం కురిపిస్తాను” అన్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి జనమంతా తండోపతండాలుగా ఆలయ ప్రాంగణంలో ఆసీనులయ్యారు. అప్పుడు ఆ సాధువు మాట్లాడుతూ 'నేను చెప్పిన ప్రకారం మీరంతా ఇక్కడికి వచ్చారు మంచిదే! కానీ మీలో ఎవరికీ నా మాటపై విశ్వాసం లేదు. ఒక్క బాలుడికి తప్ప!' అని అన్నాడు. 

'ఎవరా బాలుడు? అతడిలో ప్రత్యేకత ఏమిటి?' అన్నట్లు అందరూ ఆశ్చర్యంగా ఆ సాధువు వైపు చూశారు. అప్పుడు ఆ సాధువు, గొడుగుపట్టుకొని గుంపులో ఉన్న ఓ ఏడేళ్ళ బాలుణ్ణి చూపించాడు. 'ఆ బాలునికి గల విశ్వాసంతో ఇప్పుడు వర్షం కురుస్తుంది' అంటూ దేవుణ్ణి ప్రార్థించి వాన కురిపించాడు. మనలో కూడా చాలామందిలో ఈ ప్రగాఢవిశ్వాసమే కొరవడుతోంది. మనపై మనకు విశ్వాసం, మన చుట్టూ ఉన్న సమాజంపై విశ్వాసం ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం.