Read more!

అంకెలతో మాయాజాలం.. సుడోకు పుట్టుక,చరిత్ర తెలుసా..

ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే..

1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది.

1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది.

2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు.

ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది.

2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.

                                                 *నిశ్శబ్ద.