భయపెడుతున్న టొమాటో ఫ్లూ
posted on Aug 24, 2022 @ 11:47AM
దేశంలో కోవిడ్-19 భయాందోళనలు ఇంకా పూర్తిగా తొలగిపోకముందే టొమాటో ఫ్లూ భయపెడుతోంది. ముఖ్యంగా పదేళ్ల పిల్లలకు ఇది సోకుతోందని డాక్టర్లు అంటున్నారు. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో పదేళ్లలోపు పిల్లలు వందమందికి ఈ వ్యాధి సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఈ ఫ్లూ వ్యాధి వల్ల పిల్లల, చేయి, పాదాలు, నోటి వద్ద వైవిధ్యంగా కనిపిస్తోంది. హర్యానా, కేరళ, కర్ణాటక , తమిళనాడు ఒడిశా రాష్ట్రాల్లో టొమాటో ఫ్లూ జ్వరాల కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.టొమాటో ఫ్లూ వ్యాధిపై కేంద్రం తాజాగా సలహా జారీ చేసింది. కేరళలోని కొల్లం జిల్లా లో టొమాటో ఫ్లూ జ్వరం మొదటి కేసు బయటపడింది.
ఈ ఫ్లూ వ్యాధి లక్షణాలు , దుష్ప్రభావాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని కేంద్రం సలహా ఇచ్చింది. టొమాటో ఫ్లూ జ్వరపీడితులకు అలసట, శరీర నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్పారు. టొమాటో ఫ్లూ వచ్చిన వారి నుంచి ఇతర పిల్లలకు లేదా పెద్దలకు ఫ్లూ వ్యాధి సంక్రమించకుండా నిరోధించడానికి ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
ఒడిశా రాష్ట్రంలో 26 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు.ఈ ఫ్లూ వచ్చిన పిల్లలను తాకవద్దని, పిల్లలు బొటనవేలిని చప్పరించే అలవాటును మానుకోవాలని వైద్యులు సూచించారు.జలుబుతో ముక్కు కారుతున్నపుడు, దగ్గినపుడు చేతిరుమాలును అడ్డం పెట్టుకోవాలని వైద్యులు చెప్పారు. వేడినీళ్లతో పిల్లలకు స్నానం చేయించడం, రోగనిరోధక శక్తిని పెంచేలా పోషకాహారం అందించాలని వైద్యులు కోరారు. వ్యాధిపీడితులకు తగినంత విశ్రాంతి, సరైన నిద్ర అవసరమని ఆరోగ్యశాఖ నిపుణులు సూచించారు.