ఆఖరి పోరాటం నేడే
posted on Jan 30, 2014 6:06AM
రాష్ట్ర విభజన బిల్లుపై చర్చకి రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అందువల్ల విభజనవాదులు, సమైక్యవాదులు ఈ రోజు శాసనసభ సాక్షిగా తమ ఆఖరిపోరాటం చేయబోతున్నారు. బిల్లుని వ్యతిరేఖిస్తూ తీర్మానం చేసి ఓటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నేతృత్వంలో సమైక్యవాదులు ప్రయత్నిస్తే, దానినిఎట్టి పరిస్థితుల్లో సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని విభజనవాదులు ప్రయత్నిస్తారు. గనుక బహుశః ఈరోజు సభలో సభ్యులు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొనే వరకు పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. విచక్షణతో వ్యవహరించవలసిన ప్రజాప్రతినిధులు, మందబలంతో తాము అనుకొన్నది సాధించాలని ప్రయత్నిస్తే బహుశః రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇదొక అత్యంత దుర్దినంగా మిగిలిపోవచ్చును.
ఇక “ఆఖరిబంతి పడేవరకు ఆట కొనసాగుతూనే ఉంటుంది” అని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఆఖరు బంతులకోసం ఎదురు చూస్తూ ముఖ్యమంత్రిగా కొనసాగుతారో లేక రాజినామా చేసి, కొత్త జెండా పట్టుకొని ప్రజల ముందుకు వస్తారో బహుశః ఈ రోజే తేలిపోవచ్చును. గత కొంతకాలంగా అన్ని టీవీ ఛానళ్లలో హోరెత్తిన సమైక్యగానం ఆగిపోయింది గనుక, కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచన కూడా అటకెక్కిందో లేక మరికొంత సమయం తీసుకొని అంటే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు ఆగి స్థాపించబడుతుందో తెలుసుకోవాలంటే ఈరోజు సభలో ముఖ్యమంత్రి రాజినామా చేస్తారా లేదా అనేదానిని బట్టి తేలిపోవచ్చును. అధికారం చేతిలో ఉంచుకొంటే చాలా సులువుగా తను అనుకొన్నవిధంగా చక్రం తిప్పడానికి వీలుంటుంది. అంతేగాక ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమే తన మాటకు విలువ, ప్రత్యేక గుర్తింపు ఉంటాయి గనుక కిరణ్ కుమార్ రెడ్డి బహుశః రాజీనామా చేయకపోవచ్చును.
ఏమయినప్పటికీ, ఈరోజుతో విభజన బిల్లు శాసనసభ గుమ్మం దాటేస్తుంది గనుక, ఈ వ్యవహారంలో రాష్ట్ర రాజకీయ పార్టీల పాత్ర ముగిసి, జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇక రాజకీయ చదరంగం మొదలవుతుంది. అందువల్ల ఇంతకాలం విభజనపై దోబూచులాడుతున్న రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ తేలికగా ఊపిరితీసుకొని, ఇకముందు అమలుచేయవలసిన వ్యూహ ప్రతివ్యూహాలపై దృష్టి పెట్టగలవు.