రాజ్యసభ సీటు కోసం ఇంత బాధపడిపోవాలా
posted on Jan 30, 2014 8:46AM
రాజ్యసభకి తనను పంపలేదని మోత్కుపల్లి నరసింహులు, ఎలాగో టికెట్ దక్కించుకొన్నా తనపై స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టారని కేవీపీ రామచంద్ర రావు కన్నీళ్లు పెట్టుకొన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. వారిలో మోత్కుపల్లి తాను ఇంతకాలం చంద్రబాబుపై ఈగ కూడా వాలనీయకుండా కాపాడుకొస్తున్నాని, అయినా చంద్రబాబు తనకు కాదని వేరెవరికో రాజ్యసభ టికెట్ ఇచ్చారని కన్నీళ్లు పెట్టుకొన్నారుట. ఇంకా గమ్మతయిన విషయం ఏమిటంటే, కన్నీరుమున్నీరు అవుతున్న ఆయనను ఎర్రబెల్లి ఓదార్చుతూ, ఎన్నికల తరువాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే, ఆయనకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని నచ్చజెప్పడం.
ఇక సమైక్యాంధ్ర కోసం పోరాడిన తనపైనే సమైక్యవాదులు స్వతంత్ర అభ్యర్ధిని నిలబెట్టడమేమిటని కేవీపీ వాపోయినట్లు సమాచారం. ఇంతకాలం పార్టీ కోసం, ప్రజల కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్నామని డప్పుకొట్టుకొని తిరిగే ఇటువంటి నేతలు అధికారం కొంత ఎంతగా విలవిలలాడుతున్నారో వారి బాధ చూస్తే అర్ధమవుతుంది. రాజ్యసభ సీటు దక్కకపోతే తమకేదో తీరని కష్టం వచ్చేసినట్లు తెగ ఫీలయిపోతున్న వీరిరువురూ త్వరలోనే ఈ బాధ, వైరాగ్యం నుండి కోలుకొని మళ్ళీ యధావిధిగా నిస్వార్ధంగా పార్టీ సేవలో, ప్రజా సేవలో నిమగ్నమవుతారని ఆశిద్దాము.