తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. తెలుగుదేశం అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు?
posted on Oct 17, 2023 @ 12:00PM
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అధికార పార్టీ 115 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 51 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రెండు రోజుల కిందట విడుదల చేసింది. ఇహనో ఇప్పుడో బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అయితే రాష్ట్రంలో అన్ని స్థానాలలోనూ పోటీ చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎన్నికల హడావుడి ఇసుమంతైనా కనిపించడం లేదు. అసలు ఈ సారి తెలుగుదేశం పార్టీ బరిలో నిలుస్తుందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ ఎన్నికల బరిలో నిలుస్తే అభ్యర్థుల జాబి ప్రకటన ఎప్పుడు అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
స్కీల్ కేసు అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ నాయకులతో ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల భేటీ అయ్యారు. ఆ భేటీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ పరిస్థితి, పోటీ విషయాలు చర్చించారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను ఇక తెలంగాణలో పార్టీ పటిష్టతపై దృష్టి సారిస్తానని చెప్పారు.
ఓ వైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. మరోవైపు ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియకు సమయం ఆసన్నమవుతోంది. ఇంకోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాజమండ్రి, ఢిల్లీ తిరుగుతున్నారు. దీంతో తెలంగాణలో సైకిల్ పార్టీపై దృష్టి సారించే వారు ఎవరనే ఓ చర్చ సైతం ఆ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో పార్టీ నాయకులంతా తెరాస గూటికి చేరారు. అయితే కేడర్ మాత్రం చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీతోనే ఉంది.
అలాగే రాష్ట్రంలో హైదరాబాద్ , ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఉంది. ఆయా జిల్లాల్లో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపితే.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు తప్పవని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇక గత ఏడాది చివరిలో చంద్రబాబు సారథ్యంలో ఖమ్మంలో నిర్వహించిన టీడీపీ శంఖారావం సభ దిగ్విజయంగా విజయవంతమైంది. అలాగే హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన సభే కాకుండా.. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా నిర్వహించిన సభలు సైతం సక్సెస్ అయినాయి. అదే విధంగా తెలంగాణలో టీడీపీ చేపట్టిన.. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కూడా మంచి ఫలితాన్ని సాధించాయి.
అదీకాక.. ఏపీలో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే.. తెలంగాణలో నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో ఐ యామ్ విత్ సీబీఎన్ , లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ అంటూ హైదరాబాద్‌లో వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు, నిరసనలకు దిగారు.
ఇక చంద్రబాబు అరెస్ట్ ప్రభావం.. తెలంగాణలో జరగనున్న ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ఆంధ్ర సెటిలర్లు భారీగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఉపాధి, ఉద్యోగాలు లేకోపోవడంతో.. భారీ సంఖ్యలో ఏపీ ప్రజలు.. తెలంగాణకు వలస వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో వారి సత్తా చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
దీంతో తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకొనే ప్రతి సెటిలరూ కూడా మరో ఆలోచనకు తావులేకుండా తెలుగుదేశం పార్టీకే ఓటు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. అలాంటి వేళ తెలంగాణలో తెలుగుదేశం పోటీ , అభ్యర్థుల ప్రకటన ఎటువంటి జాప్యం లేకుండా జరగాలని తెలుగుదేశం శ్రేణులే కాకుండా పార్టీ అభిమానులు సైతం కోరుతున్నారు.