సంఘీభావ యాత్రలను సహించరా ?
posted on Oct 17, 2023 @ 12:38PM
ఆంధ్ర ప్రదేశ్ లో రాజ్యాంగం అమలవుతోందా? అక్రమ కేసులో మాజీముఖ్యమంత్రిని జైలు పాలు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండ్ గా కొత్తగా వచ్చిన డిఐజీ రవికిరణ్ టిడిపి శ్రేణులపై ఉక్కుపాదం మోపారు. డెమాక్రటిక్ పద్దతితో చంద్రబాబు అర్ధాంగి రాజమండ్రి జైలు వద్ద ఇవ్వాల్టి నుంచి చేపట్టిన రెండు రోజుల సంఘీభావ కార్యక్రమాన్నిఅడ్డుకుని మరిన్ని విమర్శలను మూటగట్టుకున్నారు.
రాజమండ్రి జైలులో ఉన్న అరకొరసౌకర్యాలతో చంద్రబాబు ఆరోగ్యం రోజు రోజుకి దిగజారుతోంది. అలెర్జీ, డీ హైడ్రేషన్, ఐదు కిలోల బరువు తగ్గడం ఆయన కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ అయిన నాటి నుంచి కనీసం హెల్త్ బులిటిన్స్ సక్రమంగా ఇవ్వకపోవడం శోచనీయం. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రజల్లో ఉన్న ఆందోళనను తొలగించే బాధ్యత కూడా వైఎస్ ఆర్ ప్రభుత్వంపై ఉంది.
ప్రజా స్వామ్యంలో నిరసనలు వ్యక్తం చేయడం రాజ్యాంగంలోనే ఉంది. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తుంది. అక్రమ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరికి సంఘీభావంగా రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి పోలీసులు అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇటీవలే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు, టిడిపి శ్రేణులు చలో రాజమండ్రి సెంట్రల్ జైలు పిలుపులో భాగంగా నిర్వహించే ధర్నాలు, రాస్తారోకోలకు ఎటువంటి అనుమతులు లేవని తూ. గో జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపిన సంగతి తెలిసిందే . పోలీసు నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో డీఐజీ రవికిరణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ మార్పుపై టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే ఇప్పుడు రాజమండ్రి జైలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. జైలులో చంద్రబాబుకు సరైన భద్రత లేదని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రావుల్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సమీప బంధువైన ఏపీ జైళ్లశాఖ కోస్తాంధ్ర రీజియన్ డీఐజీ ముదపురెడ్డి రవికిరణ్... రాజమండ్రి జైలు ఇన్ ఛార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో టీడీపీ క్యాడెర్ మరింత ఆందోళన నెలకొంది. రవికిరణ్ ఎంట్రీతోనే చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరికి అనుమతి నిరాకరించారు. దీనిపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. తాజాగా నారా భువనేశ్వరి రెండు రోజుల పాటు చేపట్టే కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం అవుతుంది. కానీ ఎపి పోలీసులు అనధికారికంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఏసీబీ కోర్టు వద్ద ఐదురకాల పోలీస్ ఫోర్సులను ఏర్పాటు చేసింది ఎపి ప్రభుత్వం. ర్యాలీలు, నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే చంద్రబాబు లాయర్లు రెండు పిటిషన్లు వేశారు. గృహ నిర్బంధానికి అనుమతి కోరుతూ ఓ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక సౌకర్యాలు ఉన్న గది కేటాయించాలని మరో పిటిషన్ వేశారు. అయితే చంద్రబాబు లాయర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. మరోవైపు పోలీసులు రాజమండ్రి జైలు పరిసరాల్లో అప్రకటిత కర్ఫ్యూ విధించారు. చంద్రబాబును స్కిల్ స్కాంలో మరింతగా ప్రశ్నించాలని సీఐడీ భావిస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో.. ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును వేధింపులకు గురి చేస్తోంది.
చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేశారు. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166,167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది.
టీడీపీ చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముందని నారా భువనేశ్వరి ప్రశ్నించారు.తనకు మనోధైర్యం కోసం పార్టీ శ్రేణులు యాత్ర చేస్తే తప్పా అని ఆమె ప్రశ్నించారు.పార్టీ కార్యకర్తలు తమ బిడ్డల్లాంటి వారని భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకొంటామని నోటీసులు ఇస్తారా అని ఆమె పోలీసులను ప్రశ్నించారు.తనను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడదన్నారు.