తెలంగాణా సిట్టింగ్ ఎంపిలకు మళ్ళీ అవకాశం లేదా ?
posted on Dec 4, 2012 9:24AM
రాష్ట్రంలోని అనేక మంది తెలంగాణా కాంగ్రెస్ సిట్టింగ్ ఎం పి లకు 2014 లో తిరిగి పోటీ చేసే అవకాశం లభించదా ? ప్రస్తుతం జరుతున్న పరిణామాలను పరిశీలిస్తే, ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే లభిస్తోంది. పరిస్థితులెలా ఉన్న, తెలంగాణ ఫై నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ హై కమాండ్ కు అంత తేలిక కాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మనుగడకు అవసరమైన ఎక్కువ మంది ఎంపిలను అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో ఇంత మంది ఎంపి స్థానాలను రాష్ట్రం నుండి తిరిగి పొందలేక పోయినా పరవాలేదు కానీ, తెలంగాణా రాష్ట్రాన్ని మాత్రం ఇచ్చేది లేదని సోనియా గాంధీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రత్యెక తెలంగాణా విషయంలో పట్టుదలతో ఉన్న కేశవ రావు వంటి సీనియర్ నాయకులను పార్టీ అధిష్టానం పక్కన పెట్టడం వంటి విషయాలను పరిశీలిస్తే తెలంగాణ ఫై పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నాయకులు తమ పట్టు సడలించుకోవాలని అధిష్టానం సూచిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.
రాహుల్ గాంధీ దూతలు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున ఎం పి స్థానాలకు పోటీ చేసే అభ్యర్దుల విజయావకాశాలఫై ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. కేవలం సిట్టింగ్ ఎం పి లకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే, ఇంత సర్వే చేయాల్సిన అవసరం లేదని రాహుల్ దూత హైదరాబాద్ లో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరిణామాలను పరిశీలిస్తే, 2014 లో రాష్ట్రంలో ఎంత మంది సిట్టింగ్ ఎం పి లు తిరిగి టికెట్లు పొందుతారనే దాని ఫై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.