మళ్ళీ తెరపైకి తివారి ?
posted on Dec 4, 2012 8:18AM
రాజకీయాల్లో అన్ని కీలక పదవులనూ అనుభవించిన నారాయణ్ దత్ తివారి మరలా రాజకీయాల్లో అడుగు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 87 సంవత్సరాల తల పండిన ఈ రాజకీయ వేత్త మరలా వార్తల్లోకి ఎక్కారు. లక్నోలో సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ తో కలసి మీడియా సమావేశం లో పాల్గొనడమే ఈ ఊహాగానాలకు కారణం. ములాయం, అయన తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు ఇద్దరూ తివారిని కలుసుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా పని చేసిన కాలంలో సెక్స్ స్కాండల్ తో అయనను కాంగ్రెస్ పార్టీ దాదాపు పక్కన పెట్టింది. ఇటీవల ఉత్తరాఖండ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆయనను మచ్చిక చేసుకోవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చింది. రాష్ట్రపతి, ప్రధాని తప్ప దేశంలోని అన్ని ముఖ్య పదవులను నిర్వహించిన ఈ నాయకునికి ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని వర్గాల్లో గణనీయ మైన పట్టు ఉండడంతో రాజకీయంగా ఎప్పుడూ డిమాండ్ ఉంటూ వచ్చింది.
ములాయం పార్టీలో చేరుతున్నారా అనే ప్రశ్నకు తివారి నేరుగా సమాధానం ఇవ్వనప్పటికీ, అయన ములాయం తో చేతులు కలపడం దాదాపు ఖాయమైనట్లే. రాజకీయంగా జిత్తులమారి అయిన తివారి కాంగ్రెస్ ను పక్కన పెట్టి సమాజ్ వాదీ పార్టీ తో చేతులు కలపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యక్తిగత జీవితం ఫై ఎన్ని విమర్శలు వచ్చినా అవి తన రాజకీయ జీవితం ఫై పడక పోవడమే తివారి ప్రత్యేకత.