Read more!

కాంగ్రెస్ లో పాదయాత్రల పోటీ! నేతల తీరుతో కేడర్ లో అనిశ్చితి 

అంతా బాగున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారిది ..ఎవరి గ్రూపు వారిది అన్నట్లుగా కథ నడిచింది.అంతర్గత కుమ్ములాటలు,జుట్టూ జుట్టూ పట్టుకోవడాలు,ఒకరిపై ఒకరు దుమ్మెతి పోసుకోవడాలు,ఒకటని కాదు అలాంటి లక్షణాలన్నీ కాంగ్రెస్ కల్చర్’గా, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేటెంట్ ఉన్న ‘సుగుణాలు’గా ముద్ర పడిపోయింది.అదే మంటే, ‘మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువండీ’ అంటూ కాంగ్రెస్ నాయకులు తప్పించుకోవడం,అందరికీ తెలిసిన గతం. 

అయినా అప్పట్లో పార్టీ అధిష్టానం బలంగా ఉండేది కాబట్టి పార్టీలో ఎన్ని గ్రూపులున్నా, నాయకుల మధ్య ఎన్ని విబేధాలున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా చివరకు అధిష్టానం మాటే వేదంగా చెలామణి అయింది.నిజానికి,అప్పట్లో బలమైన ప్రాతీయ నాయకులను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు పార్టీ అధిష్టానమే రాష్ట్రాల్లో గ్రూపులను ప్రోత్సహించేదని కూడా ఆనాటి మాటగా అంటారు. 

సరే  అదంతా గతం. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ అధినాయకత్వం ఎంత బలహీనంగా వుందో వేరే చెప్పనక్కర లేదు. కేంద్రంలో అధికారం లేదు. లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా లేదు. చివరకు సుమారు, రెండు సంవత్సరాలుగా పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేరు. పార్టీ సీనియర్ నాయకులు ‘తిరుగుబాటు బావుటా’ ఎగరేశారు. ఏకంగా 21 మంది అధిష్టానానికి అసమ్మతి లేఖ  రాశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని,తక్షణమే పూర్తి  స్థాయి అధ్యక్షుని ఎన్నుకోవాలని వత్తిడి తెచ్చారు. అయినా, తూతూమంత్రంగా సీడబ్ల్యూ సమావేశం నిర్వహించి, అధ్యక్షుని ఎన్నిక క్రతువును జూన్’ వరకు వాయిదా వేశారు. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.  

దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డిటో డిటోగా ఇంచుమించుగా అంతే అధ్వాన్నంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన పార్టీ ఎమ్మెల్ల్యేలలో ఇంచుమించుగా సగం మంది అధికార తెరాసలోకి వెళ్లి పోయారు.దుబ్బాక,జీహెచ్ఎంసీ పరాభవం తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ అడుగుజాడల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుని ఎన్నికకు పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్’ కొంత కసరత్తు చేశారు. కొన్ని పేర్లను పైకి తీసారు. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క ... మరి కొని పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. మాణిక్ ఠాగూర్ జాబితాలో పేరు లేని జగ్గా రెడ్డి లాంటి వారు నొచ్చుకున్నారు. ‘మా సేవలకు గుర్తింపు ఏదని వాపోయారు. ఇంతమంది పార్టీలో పుట్టి,పార్టీలో పెరిగిన సీనియర్లు ఉండగా, నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి’ని ఎలా అధ్యక్షుని చేస్తారని వీహెచ్ లాంటి కొందరు సీనియర్లు చిందులేశారు... అయినా మాణిక్ ఠాగూర్ ఎంపిక చేసిన జాబితా సోనియా గాంధీ టేబుల్ మీదకు చేరింది. ఆమె టిక్’  కూడా పెట్టేశారుయ 

ఏ క్షణంలో అయినా కొత్త అధ్యక్షుని నియామక ప్రకటన వెలువడుతుందని అనుకున్నారు. ఇంతలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక తెర మీదకు వచ్చింది. ఆ స్థానం నుంచి పోటీ చేసే పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అభ్యర్ధన మేరకు, ఉప ఎన్నికల వరకు పార్టీలో  ఐక్యతను కాపాడేందుకు పీసీసీ అధ్యక్షుని ఎన్నిక వాయిదా పడింది.ఉత్తమ కుమార్ రెడ్డి అందాకా తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతారు. అంటే,ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయిలలో తల లేని మొండెం లాగా అధ్యక్షుడు లేని పార్టీగా మిగిలింది. అదొకటి అలా ఉంటే, పార్టీలో ఐక్యత ఆశించి అధ్యక్ష ఎంపికను వాయిదావేస్తే, అధ్యక్ష పదవి పోటీలో ఉన్న వారు ఎవరికీ వారు పోటాపోటీగా పాదయాత్రల బాట పట్టారు. ఇప్పటికే, రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఎవరి దారిన వారు పాదయాత్రల సాగిస్తున్నారు.ఈ నెల 20 నుంచి కోమటి రెడ్డి తమ స్వగ్రామం నల్గొండ జిల్లా బ్రహ్మనవెళ్ళం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టున పూర్తి చేయాలన్న డిమాండ్’తో పాద యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.అలాగే సిద్ధిపేట ఎమ్మల్యే జగ్గ రెడ్డి కూడా ఈ నెల 22 నుంచి పాదయాత్రకు సిద్దమయ్యారు. 

 అయితే కాంగ్రెస్ నాయకుల పాద యాత్రలు విమర్శలు ఎదుర్కుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు, తెరాస, బీజేపీ టీపీసీసీ అధ్యక్ష పదవి కోసమే కాంగ్రెస్ నాయకులు పాదయత్రాలు  చేస్తున్నారని ఆరోపిస్తుంటే, సొంత పార్టీ కార్యకర్తలు క్రింది స్థాయి నాయకులు ఇలా పార్టీ సీనియర్ నాయకులు ఎవరి దారిన వారు పాదయాత్రలు చేయడం వలన పార్టీకి మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని  ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్త చేస్తున్నారు. ఓ వంక తెరాస, బీజేపీ ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదే విధంగా  నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సిద్డంవుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పాదయాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇలా ఎవరికి  వారు కాకుండా అందరూ కలిసి కార్యకరమాలు నిర్వహిస్తే కార్యకర్తలు ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందని, అలా కాకుండా ఇలా ఎవరి దారినవారు పొతే ప్రయోజనం ఉండదని అంటున్నారు.

అయితే పార్టీ నాయకులు మాత్రం యాత్రలు వేరైనా అందరి గమ్యం,లక్ష్యం ఒక్కటే అని, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాన్ని, కేంద్రంలో బీజీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని పేర్కొంటున్నారు. మరో వంక ఈ పాద యాత్రలు చివరకు కాంగ్రెస్ పార్టీని ఈ గమ్యం చేరుస్తాయో ... కాలమే నిర్ణయిస్తుంది అనుకోవడమే కాంగ్రెస్ కార్యకర్తల విధి ...  దట్స్ ఇట్ .