యథా కేసీఆర్ తథా రాజయ్య
posted on Feb 14, 2015 @ 3:54PM
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు వేలెట్టడానికి వీలులేదంటారు. అందుకు అనేక కారణాలు చెపుతుంటారు కూడా. నిన్న మొన్నటి వరకు తెలంగాణా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన డా. టీ. రాజయ్య కూడా ఇప్పుడు కేసీఆర్ నే ఆదర్శంగా తీసుకొన్నట్లున్నారు. ఆయన కూడా తన స్టేషన్ ఘన పూర్ నియోజకవర్గంలో తెరాస నేతలెవరూ వేలెట్టడానికి వీలులేదంటున్నారు.
ఆ మధ్యన మోడీ ప్రభుత్వం తెలంగాణా పట్ల సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని మోడీకి శాపనార్ధాలు పెట్టిన కేసీఆర్, ఇప్పుడు అదే నాలికతో మోడీ అంత గొప్ప నాయకుడు లేనేలేడని, ఆయన దేశాన్ని ఎక్కడికో తీసుకు వెళ్లిపోతున్నారని తెగ పొగిడేస్తున్నారు. ఇంతకు ముందు మోడీ ప్రకటించిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ఏ మాత్రం పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల చేత వారంలో ఒకరోజు చీపురు పట్టించేసి స్వచ్చ భారత్ కూడా చేసేస్తామని ప్రకటించారు. కవితమ్మకు కేంద్రమంత్రి పదవి ఇప్పించేందుకే కేసీఆర్ ట్యూన్ మార్చేరని ప్రతిపక్షాలు చెవులు కోరుకొంటున్నాయి.
ఇంతకు ముందు తనను ఉపముఖ్యమంత్రి పదవిలో నుండి దింపేసినప్పుడు డా.రాజయ్య కూడా కూడా కేసీఆర్ పై ఇలాగే చిర్రుబుర్రులాడారు. కానీ ఇప్పుడు కేసీఆర్ చాలా గొప్పగా పరిపాలిస్తున్నారని, తాను కేవలం ఆయనకే జవాబుదారిగా ఉంటానని ప్రకటించేసారు. పనిలోపనిగా తెలంగాణా కోసం తను చేసిన త్యాగాలను ప్రజలకు ఓసారి గుర్తుచేసి ఇకపై తన నియోజక వర్గం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి గట్టిగా కృషిచేస్తానని ప్రకటించేసారు.
రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం నీళ్ళు, విద్యుత్ లో తెలంగాణకు న్యాయంగా రావలసిన వాటాను ఆంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కేసీఆర్ వాదించడం అందరికీ తెల్సిన విషయమే. అదేవిధంగా తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం 50 శాతం సబ్సిడీపై సన్న, చిన్నకారు రైతులకు ట్రాక్టర్లను అందిస్తోంది. ఈ పధకంలో వరంగల్ జిల్లాకు మొత్తం 94 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వాటిలో రాజయ్యకు చెందిన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గంలో ఒక్కో మండలానికి రెండు చొప్పున ట్రాక్టర్లు మంజూరు అయ్యాయి. ఆ పంపకాలన్నీ తన కనుసన్నలలోనే జరగాలని రాజయ్య అనుకొంటుంటే, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వాటిలో ఒక దానిని తనకు బాగా పరిచయమున్న ఒక రైతుకు కేటాయించమంటూ ఒక సిఫార్సు లేఖ ఇచ్చారు. సదరు రైతు ఈ పథకాంలో లబ్ది పొందేందుకు అన్ని విధాల అర్హుడని పేర్కొంటూ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీడీవోలు సంతకాలు చేసి ఇచ్చేసారు. దానితో అధికారులు కూడా ఆ రైతుకి ట్రాక్టరు మంజూరు చేస్తున్నట్లు తెలియజేసారు.
ఈ సంగతి తెలుసుకొన్న రాజయ్య అధికారుల మీద విరుచుకు పడ్డారు. కడియం ఇచ్చిన సిఫార్సు లేఖ ఆధారంగా ట్రాక్టర్లు ఎవరికీ పడితే వారికి ఇచ్చినట్లయితే ‘కబడ్ధార్’ అంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ఆయన కూడా మరో రైతు పేరును సిఫార్సు చేసినట్లు తాజా సమాచారం. ఈనెలాఖరులోగా ఈ సబ్సిడీ ట్రాక్టర్ల పంపకం జరగిపోవాలి. కానీ ఇప్పుడు రాజయ్య అడ్డుపడుతుండటంతో అధికారులు తలలు పట్టుకొన్నారు. బహుశః ఈ పంచాయితీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వెళ్ళవచ్చును. అప్పుడు ఆయన రాజయ్యను కాదని కడియంకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది మరొక పంచాయితీ అవుతుంది.