నీది కాపు.. నాది కాపు! బీజేపీలో ఎమ్మెల్సీ చిచ్చు
posted on Mar 21, 2021 8:40AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. తమ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్-రంగారెడ్జి- మహబూబ్ నగర్ స్థానంలో రెండో స్థానంలో నిలవగా.. నల్గొండ-వరంగల్- ఖమ్మం సీటులో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. నల్గొండ స్థానంలో బీజేపీ కంటే స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, టీజేఎస్ అధినేత కోదండరామ్ ముందు నిలిచారు. నల్గొండ స్థానానికి తొలి ప్రాధాన్యతలో 2 లక్షల 86 వేల ఓట్లు పోలయితే.. బీజేపీ అభ్యర్థికి ప్రేమేందర్ రెడ్డికి కేవలం 40 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీకి తొలి ప్రాధాన్యతలో కేవలం 13 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా ఉద్యోగులు, విద్యావంతులే. ఈ వర్గం ఓటర్లు మొదటి నుంచి బీజేపీకి మద్దతుగా ఉంటారు. ప్రస్తుతం కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు టీఆర్ఎస్ పేరు వింటేనే మండిపోతున్నారు. ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నందు వల్లే దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి షాకిచ్చింది బీజేపీ.ఈ నేపథ్యంలో శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా టీఆర్ఎస్ నేతలుఎవరూ ముందుకు రాలేదు. యువత ప్రభుత్వంపై కోపంగా ఉండటంతో ఓడిపోతామనే భయంతోనే పోటీకి గులాబీ నేతలు భయపడ్డారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమనే అంతా అనుకున్నారు. కాని ఇప్పుడు ఫలితాల్లో మాత్రం సీన్ రివర్సైంది. అనూహ్యంగా హైదరాబాద్ సిట్టింగు సీటును కోల్పోయిన బీజేపీ.. నల్గొండలో అయితే దారుణమైన ఓట్లు సాధించింది. ఇదే ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతోంది.
పార్టీ నేతల ఆధిపత్య పోరు, స్వ ప్రయోజనాల కోసం వేసిన ఎత్తుల వల్లే ఈ ఫలితాలు వచ్చాయనే చర్చ కమలం నేతల్లో జరుగుతోంది. నల్గొండ బీజేపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తనకు సహకరించకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థితో కుమ్మక్కు కావడం వల్లే ఫలితాల్లో బీజేపీ వెనుకబడింది అని ప్రేమేందర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయారని చెబుతున్నారు.ఉద్యోగస్తులు, టీచర్లు, లాయర్లు బీజేపీకి అండగా ఉన్నారని, అయినా ఓటింగ్ లో మాత్రం ఆ ఓట్లలో అధిక శాతం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ అయ్యాయి.. దీని వెనుక ఒక సామాజిక కుట్ర దాగి ఉందని ప్రేమేందర్ రెడ్డి కొందరితో అన్నారని తెలుస్తోంది. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని కొందరు నేతలు బలిపెట్టాడని, తన సామాజిక వర్గాన్ని పెంచి, ఇతర సామాజిక వర్గాలను తొక్కాలని బండి సంజయ్ చూస్తున్నారని గుజ్జుల ఆరోపించారట.
హైదరాబాద్ స్థానంలోనూ పార్టీ ఓటమికి నేతల మధ్య వర్గపోరే కారణమనే ఆరోపణలు కమలం నేతల నుంచే వినిపిస్తున్నాయి. రామచంద్రరావుకు సంజయ్ వర్గం సరిగా సహకరించలేదనే విమర్శలు వస్తున్నాయి. రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సపోర్టుగా ఉంటారని.. అందువల్లే సంజయ్ వర్గం ఆయనను పట్టించుకోలేదని కొందరు చెబుతున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది కనిపించిందని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్.. తూతూమంత్రంగానే ప్రచారం నిర్వహించారని, పార్టీ నేతలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోలేదని రామచంద్రరావు అనుచరులు చెబుతున్నారు.
మొత్తంగా వరుస విజయాలతో దూకుడుగా వెళుతున్న బీజేపీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బ్రేక్ వేశాయనే చర్చ జరుగుతోంది. వరుస విజయాలు, పార్టీలోకి వలసలు పెరగడంతో... బీజేపీ కూడా అతి విశ్వాసానికి పోయిందని, అందుకే ఫలితాలు ఇలా వచ్చాయనే వాదన కూడా రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.