సాగర్ బరిలో తీన్మార్ మల్లన్న! యుద్ధం ఇంకా మిగిలే ఉంది..
posted on Mar 21, 2021 8:59AM
తీన్మార్ మల్లన్న... అలియాస్ చింతపండు నవీన్ కుమార్... సామాన్య జర్నలిస్ట్ ఇప్పుడు జనాల గుండెల్లో హీరోగా మారిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటంతో సామున్యుల మనుసులు గెలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామన్‌మేన్‌లా సింగిల్‌గా వచ్చారు మల్లన్న. సింహంలా గాండ్రించాడు. పులిలా పంజా విసిరాడు. దుమ్ము రేపాడు. ఆయన గెలవకున్నా.. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కి గట్టి ఝలక్ ఇచ్చాడు. తెలంగాణ ఉద్యయ సారథి కోదండరాం సార్‌కు సైతం షాకిచ్చారు. ఈ ఒక్క మగాడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొనగాడిలా నిలిచాడు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి వరకు పోరాడిన.. తీన్మార్ మల్లన్న ఫలితాల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. యుద్ధం ఇంకా మిగిలే ఉందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ ను ఫాంహౌజ్ ను పంపించేంత వరకు విశ్రమించబోననని స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న. సామాన్యుల గొంతుకై ప్రజా పోరాటం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోీటీపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు తీన్మార్ మల్లన్న. దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మల్లన్న పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పోటీ చేసే విషయంపై ఆయన దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
నాగార్జున సాగర్ లో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే.. సమరం మరింత రంజుగా మారనుంది. ఇప్పటికే సాగర్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ , మాజీ మంత్రి జానారెడ్డి బరిలోకి దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బలమైన క్యాండిడేట్ కోసం ఆ పార్టీలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంజా విసిరిన తీన్మార్ మల్లన్న.. సాగర్ లో పోటీ చేస్తే రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయని భావిస్తున్నారు. సాగర్ పరిధిలో బీసీ వర్గాల ఓట్లు ఎక్కువగా. బీసీ నినాదంతో మల్లన్న రంగంలోకి దిగితే.. అన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టడం ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో మల్లన్నపై జనాల్లో మరింత క్రేజీ పెరిగింది. ఇది తప్పకుండా సాగర్ లో ప్రభావం చూపిస్తుందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న పోరాటంపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరుగుతోంది. ఏ రాజకీయ పార్టీ అండదండలు లేవు.. అతడికి ఏ యూనియన్ మద్దతు లేదు.. సినీ గ్లామర్ లేదు. కోట్ల కొద్దీ ఆస్తులు లేవు. ఒక సాధారణ మధ్యతరగతి మనిషి. కేవలం యూట్యూబ్ ఛానల్ లో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వ్యక్తికి ఇంత ఫాలోయింగా? అన్న చర్చ జనాల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను తుర్పారా పెట్టే ఓ సామాన్యుడికి ఇంత క్రేజా? రాజకీయ పార్టీల అభ్యర్థులు దరిదాపుల్లో లేరు. వంద కోట్ల రూపాయలు కుమ్మరించి గెలవాలనుకుంటున్న పార్టీకి చెమటలు పట్టిస్తున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న సంచలనంగా మారారు.
సర్కారును ఎప్పటికప్పుడు చీల్చి చెండాడమే తీన్మార్ మల్లన్న పని. రోజూ అధికార పార్టీని ప్రశ్నించడమే. నేతల తీరును నిప్పులతో కడిగి నిగ్గదీసి అడగడమే. జెండా లేకున్నా ఎజెండా మాత్రం క్లియర్. అది.. కేసీఆర్‌పై దండయాత్ర. రేవంత్‌రెడ్డి తర్వాత ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో కడిగేసే ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్నే. అదే జనాలకు నచ్చింది. ఆ దూకుడే వారిని ఆకట్టుకుంది. ఆ దమ్ము.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ము రేపిందని చెబుతున్నారు. మామూలు మనిషి మల్లన్న.. ఇంతటి హేమాహేమీలను పడగొట్టడం మామూలు విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మల్లన్నకే సాధ్యమంటున్నారు. ఎమ్మెల్సీగా మల్లన్న గెలిచాడా లేదా అన్నది తర్వాత.. మల్లన్న ఓడినా గ్రేటే. సింగిల్‌గా.. సామాన్యుడిగా.. అంత పెద్ద పార్టీలకు.. అంత పెద్ద నేతలకు.. ముచ్చెమటలు పట్టించడం నిజంగా గ్రేటాది గ్రేట్ అంటున్నారు.