చివరి దశకు చేరుకొన్న విభజన బిల్లు
posted on Feb 7, 2014 @ 3:36PM
సుప్రీంకోర్టు రాష్ట్ర విభజన అంశంలో ఇక జోక్యం చేసుకోదని స్పష్టమయింది గనుక ఇక కేంద్రం కూడా దైర్యంగా ముందుకు సాగవచ్చును. ఈరోజు సాయంత్రం జరగనున్న కేంద్రమంత్రి మండలి సమావేశంలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టబడుతుంది. సీమాంధ్ర మంత్రుల ఒత్తిడి మేరకు జీ.ఓ.యం. ఆ బిల్లులో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం వంటి సవరణలు ఏమయినా చేసి ఉంటే, వాటిపై ఈ సమావేశంలో మరోమారు చర్చించిన తరువాత, బిల్లుని ఆమోదించి రాష్ట్రపతికి పంపుతారు.
ముఖ్యమంత్రితో సహా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు అనేకమంది ఇచ్చిన విజ్ఞప్తులను, చేసిన అభ్యర్ధనలను ఆయన పరిగణనలోకి తీసుకోనేమాటయితే బిల్లుకి మళ్ళీ ఆటంకం ఏర్పడవచ్చును. కానీ, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలుగజేసుకోబోదని తేల్చిచెప్పినందున, బహుశః ఆయన కూడా తన వద్దకు వచ్చిన బిల్లుని యధాతధంగా ఆమోదించి పంపే అవకాశం ఉంది.
ఆ దశ దాటిపోయినట్లయితే, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి తగిన మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. ఒకవేళ బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ వ్యవహారంలో తమ చేతికి మసి అంటకుండా తప్పుకోదలిస్తే, ఓటింగ్ సమయంలో సభ సజావుగా నడవడం లేదనే వంకతోనో లేకపోతే మరొక కుంటి సాకు చెప్పో వాకవుట్ చేసి సభనుండి బయటపడినట్లయితే, కాంగ్రెస్ అధిష్టానం ఉభయ సభలలో తనకున్న బలంతో ఆ గందరగోళం నడుమే రాష్ట్ర విభజన బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదింపజేయవచ్చును.
కానీ, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే మాత్రం తెలంగాణావాదులు కూడా సభలో బిల్లుని తీవ్రంగా వ్యతిరేఖించవచ్చును. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేసేందుకు సిద్దపడినట్లయితే, ఎలాగు సీమాంధ్రలో ఇప్పటికే తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకొంది గనుక, హైదరాబాద్-కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదనను కూడా బుట్ట దాఖలు చేయడం వలన పార్టీకి సీమాంధ్రలో కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదు గనుక అలా చేసినా ఆశ్చర్యం లేదు.