సమైక్యవాదులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
posted on Feb 7, 2014 @ 3:07PM
రాష్ట్ర విభజన బిల్లుకి వ్యతిరేఖంగా పయ్యావుల కేశవ్ తదితరులు తొమ్మిది మంది వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు నారిమన్ మరియు మోహన్ లాల్ శర్మల వాదనలు విన్న తరువాత తీర్పు వెలువరిస్తూ “ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అంశంలో కోర్టు కలుగజేసుకోలేదని తేల్చి చెప్పారు.పిటిషనర్లు తరపున వాదించిన న్యాయవాదులు, కేంద్రం ఆర్టికల్ మూడుని దుర్వినియోగం చేస్తోందని అందువల్ల విభజన ప్రక్రియను వెంటనే నిలిపివేయమని ఆదేశించాలని కోరినప్పటికీ కోర్టు వారి అభ్యర్ధనను మన్నించలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా ఇదివరకు వారు చేసిన వాదనలకు, ఇప్పుడు వారు చేస్తున్న వాదనలకు పెద్ద తేడా లేదని, అందువల్ల ఈవిషయంలో కోర్టు కలుగజేసుకోలేదని తేల్చి చెప్పింది. అంతేగాక వారు లేవనెత్తిన మరో అంశం-కేంద్రం పంపిన విభజన బిల్లుని రాష్ట్ర శాసనసభ తిరస్కరించింది గనుక దానిపై కోర్టు తన అభిప్రాయం తెలిపి స్పష్టత ఇవ్వాలని వారి అభ్యర్ధనను కూడా కోర్టు పట్టించుకోలేదు.