తెలంగాణా బంద్ దేనికంటే...
posted on Jun 1, 2014 @ 3:54PM
తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేప్పట్టబోతున్న కేసీఆర్ పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ స్వయంగా తెలంగాణాకు బంద్ కు పిలుపీయడంతో, తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఎంతో విజయవంతంగా బంద్ నిర్వహించామని ఉప్పొంగిపోయిన తెరాస నేతల ఆ విమర్శలు చూసి జరిగిన పొరపాటుకు నాలుక కరుచుకొని సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది.
తెరాస నేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, “మాది ప్రజా సమస్యలపై పోరాడేందుకు పుట్టిన ఉద్యమ పార్టీ. తెలంగాణా జిల్లాలలో ఏ మూల గ్రామంలో ప్రజలకు కష్టమొచ్చినా వారి తరపున పోరాడేందుకు మేము సిద్దంగా ఉంటామని చెప్పేందుకే ఈ బంద్ నిర్వహించాము. ముంపు గ్రామాలలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకే మేము పోరాటం మొదలుపెట్టవలసి వచ్చింది. వెయ్యి అబద్దాలు ఆడయినా ఒక పెళ్లి చేయమని పెద్దలు అన్నట్లు, కేసీఆర్ నాయకత్వంలో అనేక పద్దతులలో కొట్లాడి చివరికి తెలంగాణా సాధించుకొన్నాము. ఇకపై దానిని కాపాడు కొనేందుకు ప్రభుత్వంలో ఉండి పోరాటాలు చేస్తాము."
"తెదేపాతో జత కట్టిన బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం చెప్పట్టినంత మాత్రాన్న, తెదేపా మాటలు విని మా తెలంగాణా ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి గట్టిగా నాలుగు రోజులు కాక ముందే, తెదేపా మాటలు విని మాకు వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకొని తెలంగాణా పట్ల తీవ్ర వివక్ష చూపారు. ఇంకా ఇక్కడ తెలంగాణాలో కానీ, అక్కడ ఆంధ్రాలో గానీ కేసీఆర్, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారమే చేయలేదు. ఇంతలోనే మోడీ ప్రభుత్వానికి ఆర్డినెన్స్ జారీ చేయవలసిన అవసరమేమొచ్చింది? అని ప్రశ్నిస్తున్నాము."
"గత అరవై ఏళ్లుగా తెలంగాణా ప్రజలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా మేము ఇంకా వివక్ష ఎదుర్కోవలసిందేనా? అని ప్రశ్నిస్తున్నాను. ఇంతవరకు ఉద్యమ పార్టీగా ఉద్యమాల ద్వారా పోరాడాము. ఇకపై ప్రజా ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉండి మా పోరాటం కొనసాగిస్తాము,” అని చెప్పారు.
ఈటెల మాటల సారాంశం ఏమిటంటే, ముంపు గ్రామాలలో భాదితులపై ప్రేమతోనొ, వారిని రక్షించుకోవాలనే తపనతోనో తెరాస తెలంగాణా బంద్ చేయలేదు. మోడీ ప్రభుత్వం చంద్రబాబు మాటలు విని తమ జోలికి వస్తే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించడానికే బంద్ చేసామని ఈటెల చెప్పకనే చెప్పుకొన్నారు. దీనిని బట్టి తెలంగాణాలో తమ బలం ఏపాటిదో ప్రధానమంత్రి మోడీకి చూపడానికే బంద్ నిర్వహించారని అర్ధమవుతోంది. గంటసేపు మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముంపు గ్రామాల నివాసితులను ఆదుకోకపోతే, తమ తెరాస ప్రభుత్వమే ఆదుకొంటుందని ఒక్క ముక్క కూడా అనలేదు.
తెరాసకు నిజంగా నిర్వాసితులవుతున్న ఆదివాసీల పట్ల అంత ప్రేమ ఉండి ఉంటే, తెలంగాణా బంద్ చేసే బదులు వారి పునరావాసం గురించి కేంద్రంతో మాట్లాడి ఉండవచ్చును. పోనీ బంద్ నిర్వహించిన తరువాతయినా వారి యోగక్షేమాల కోసం తమ ప్రభుత్వం ఏమి చేయబోతోందో చెప్పింది లేదు. కనీసం అధికారుల ద్వారా అయినా కేంద్రాన్ని సంప్రదించే ప్రయత్నమూ చేయలేదు. కానీ ఆదివాసీల కోసం పోరాటాలు చేస్తామని మాత్రం హామీ ఇస్తున్నారు. ఆదివాసీలకు భద్రత, పునరావాసం కల్పించలేని తెరాస పోరాటాల వల్ల ఏమి ప్రయోజనం? కేంద్రం ప్రభుత్వం, ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య జరిగే ఈ రాజకీయ యుద్దంలో అభం శుభం ఎరుగని ఆదివాసీలు లేగాదూడల్లా నలిగిపోకుండా, ఎవరో ఒకరు వారిని మానవత్వంతో కాపాడగలిగితే చాలు.