తెలంగాణా గని కార్మికులను దోచుకుంటున్న బొగ్గు సంఘాలు
posted on Feb 24, 2012 8:52AM
హైదరాబాద్: కార్మిక ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని గొప్పలు చెప్పుకునే బొగ్గుగని సంఘాలు నాయకులు తెలంగాణా ప్రాంతంలో లంచావతారులుగా మారారు. పైరవీలకు ప్రాధాన్యతనిస్తూ ఒక్కో పనికి ఒక్కో ధర కడుతున్నారు. కార్మికులనుంచి అందినంత దోచుకుంటున్నారు. స్వలాభం కోసం యాజమాన్యం ముందు మోకరిల్లి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. క్వార్టర్ల మంజూరు, బదిలీలు, ప్రమోషన్లు, విఆర్ఎస్, సిఎంపిఎఫ్ తదితర పనులకోసం వేలల్లో లంచాలు తీసుకుంటున్నారు. ఒక్కో క్వార్టర్ కు డిమాండ్ ను బట్టి రూ.5వేల నుంచి 10వేల వరకు వసూలు చేస్తున్నారు. రెండేళ్ళ క్రితం వివిధ గనుల్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులకు యాజమాన్యం జనరల్ మజ్దూర్ గా పదోన్నతి కల్పించింది. ఆ పదోన్నతులు ఇప్పించింది తామేనంటూ కొందఱు నాయకులు ఒక్కో కార్మికుడి నుంచి రూ.10నుంచి 20వేల వరకు వసూలు చేశారు. సింగరేణిలో ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న కార్మికులు గోల్డెన్ షేక్ హ్యాండ్ (విఆర్ఎస్) పెట్టుకుంటే వారినుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. కంపెనీ నిబంధనల మేరకు విఆర్ఎస్ వర్తించిందని, అధికారులతో మాట్లాడి పనిచేసి పెడతామని నమ్మబలికి ముడుపులు తీసుకుంటున్నారు. సింగరేణిలో ఔట్ సోర్సింగ్ కింద పనుల్లో పెట్టేందుకు కూడా కార్మిక నాయకులు వేలాది రూపాయలు లంచం అడుగుతున్నారంటే పరిస్థితి ఎలావుందో అర్ధం చేసుకోవచ్చు.