35కేసులు..24విచారణలు..ఒక్క రిమార్కు లేదు
posted on Feb 23, 2012 @ 3:55PM
హైదరాబాద్: తనపై 35 కేసులు పెట్టారని, 24 విచారణలు జరిపించారని, అయినా తనపై ఒక్క రిమార్కు కూడా లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తనను ఏమీ చేయలేరని ఆయన అన్నారు. తన ప్రభుత్వ హయాంలో తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు. గచ్చిబౌలిలో స్టేడియం కట్టిస్తే కాంగ్రెసు సమావేశాలకు వాడుకుంటోందని ఆయన విమర్శించారు. జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తనను హెచ్చరిస్తున్నారని, తన 9 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై సభలో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. సిబిఐ విచారణ కూడా తన ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను తప్పు పట్టలేదని ఆయన అన్నారు. తనపై బురద చల్లాలని ప్రయత్నిస్తే అది వారి మీదే పడుతుందని ఆయన కాంగ్రెసు నాయకులను ఉద్దేశించి అన్నారు.
కాగా, తన కుమారుడిపై కూడా కాంగ్రెసు నాయకులు ఆరోపణలు చేశారని, తన కుమారుడి చదువుకు పెట్టిన ఖర్చులపై ఆ ఆరోపణలు చేశారని, తన అబ్బాయి పేరు చెప్పి కూడా కోర్టుకు వెళ్లారని, తనను ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు అన్నారు. చదువుకు పెట్టిన ఖర్చులకు సంబంధించిన పత్రాలను ఆయన స్పీకర్‌కు అందజేశారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చదువుకు పెట్టిన ఖర్చులపై కాంగ్రెసు నాయకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దానిపై చంద్రబాబు ఆ వివరణ ఇచ్చారు.