ఉపాధి పనుల్లో రూ.200 కోట్ల అక్రమాలు?
posted on Feb 24, 2012 9:27AM
అక్రమార్కుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు
తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉపాధి హామీ పనుల్లో సుమారు రూ.200 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఎపిఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రూపు లీడర్లు, మెట్స్, ఎంపిపి-1, టెక్నికల్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా న్యాయస్థానాలు ఏర్పాటుచేసి వీరిపై విచారణ జరపబోతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 26న రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక కోర్టును ప్రారంభించబోతున్నారు. త్వరలో ఇటువంటి కోర్టులను అన్ని జిల్లాలలోనూ ఏర్పాటుచేస్తారు. ప్రభుత్వాన్ని, లబ్దిదారులను మోసం చేసే ఉద్దేశ్యంతో రికార్డులు తారుమారు చేయడం లేదా లబ్దిదారుల ప్రయోజనాలను ఇతరులతో కలిసి కాజేయడం, అవినీతికి పాల్పడటం, ఈ తరహా నేరాలు చేయడానికి కుట్రపన్నడం, ఇతరులకు సహకరించడం నేరంగానే పరిగణిస్తారు. వీరిపై నేరాలు నిరూపణ అయితే మూడునెలల నుంచి మూడేళ్ళ వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.