రాష్ట్రంలోఇక మహాఉద్యమానికి తెర : రాఘవులు
posted on Jan 30, 2012 @ 2:27PM
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ.రాఘవులు ఆరోపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన అంశంలో రాజకీయ పార్టీలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాయన్నారు. అందుకే నాన్చుడి ధోరణిని అవలంభిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్న తెలంగాణ అంశంపై ప్రభుత్వాలు తేల్చకుండా రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కల్గిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అంశాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలన్నీ కేవలం ఎన్నికల ప్రాధాన్యం తప్ప, ప్రజాసమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.దీనిపై తమ పార్టీ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఈ మహాసభల్లో ప్రజాకోర్కెల పత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇక మహాఉద్యమానికి తెరలేవనుందని, దీనిపై ఇప్పటికే ఇతర పార్టీలతో చర్చ జరుగుతోందని, పార్టీల వివరాలు, ఉద్యమ పంథాను మహాసభల చివరి రోజైన ఫిబ్రవరి 4న వెల్లడిస్తామని రాఘవులు ప్రకటించారు.