ఆ వర్గాలవారిని తన వద్దకు లాక్కుంటున్న జగన్
posted on Jan 30, 2012 @ 2:41PM
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా చెప్పుకునే రెడ్డి, క్రైస్తవ, దళిత వర్గాలకు చెందిన ఓటర్లను ఆకర్షించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రధాన టార్గెట్‌గా మారింది. ఈ వర్గాల వారినే ఆయన ఎక్కువగా తన వద్దకు చేర్చుకుంటున్నారనే ప్రచారం అంతర్గతంగా సాగుతోంది. దీనికితోడు.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి వర్గం చేరికతో కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్న రెడ్డి సామాజిక వర్గ నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. అయితే, కీలక శాఖలను రెడ్డి వర్గానికే కేటాయించినప్పటికీ... ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా మంత్రుల సంఖ్యను చూస్తే కాపు వర్గానిదే పైచేయిగా ఉంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా వాతావరణం కనిపిస్తోంది. దీన్ని సాకుగా తీసుకున్న ఈ రెండు వర్గాలకు చెందిన నేతలు జగన్‌తో అంతర్గతంగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు ఇప్పటికిపుడు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధపడక పోయినప్పటికీ.. వారి బంధుగణం, అనుచరులు, ద్వితీయశ్రేణి నేతలను మాత్రం జగన్ పార్టీతో సంబంధాలు కొనసాగించేందుకు సమ్మతించినట్టు వినికిడి. దీంతో ఈ వర్గాలకు చెందిన ఓటు బ్యాంకు కూడా జగన్ వైపుకే వచ్చే అవకాశాలు ఉన్నాయి.