జాతీయ పానియంగా తేనీరు.. బీజేపీ ఎంపీ డిమాండ్
posted on Dec 14, 2022 8:26AM
జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి.. మరి జాతీయ పానియం? ఈ విషయంలోనే అసోంకు చెందిన బీజేపీ పబిత్రా మర్గెరిటాకు కోపం వచ్చింది. తేనీరు (టీ)ని జాతీయ పానియంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరో అవర్ లో మంగళవారం (డిసెంబర్ 13)న ఆయన మాట్లాడారు. దేశంలో మరేం సమస్యా లేదన్నట్లు టీకి జాతీయ పానియం హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
అంతటితో ఊరుకోకుండా దేశంలో ప్రజల జీవనంలో తేనీరు ఒక భాగమని చెప్పారు. దేశంలో అత్యధికులు తమ రోజును ఒక కప్పుటీతో ప్రారంభిస్తారని తెలియజేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అందరి జీవనంలో తేనీరు అంతర్భాగమన్నారు. అంతెందుకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం చాయ్ వాలాగానే ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. మరి ఇన్ని ఘనతలున్న తేనీరును జాతీయ పానియంగా ప్రకటించకపోతే ఎలా అని పార్లమెంటు వేదికగా ప్రశ్నించారు. టీని జాతీయ పానియంగా ప్రకటించడంతో పాటు.. తేయాకు తోటల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు.
తేయాకు తోటలలో పని చేసే కార్మికుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలనీ కోరారు. 2023లో అస్సాం టీ 200వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుందనీ, అసోం ప్రజలు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారని చెప్పిన ఆయన ఈ సందర్భంగానైనా తేనీరును జాతీయ పానియంగా ప్రకటించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.