అమ్మో అమ్మాయేనా?.. ఇంటికొస్తున్నా ఇవన్నీ సిద్ధం చేయండంటూ తండ్రికి మెసేజ్
posted on Dec 14, 2022 8:56AM
పిల్లలంటే తల్లిదండ్రులకు మురిపెం. పిల్లలేం చేసిన వారికి ముద్దుగానే ఉంటుంది. అందులోనూ తమకు దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న పిల్లలంటే మరీను. వారికి సెవలులెప్పుడొస్తాయా? ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూనే ఉంటారు. అలాగే పిల్లలకు కూడా ఇంటి మీద బెంగ ఉంటుంది.
గారంగా కోరితే కొండమీది కోతిని కూడా తెచ్చిచ్చే తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండటం వారికీ ఇబ్బందే. అందుకే హాస్టల్ కు వెళ్లిన రోజు నుంచీ వారు ఎప్పుడు సెలవులు వస్తాయా? ఎప్పుడు ఇంటికి వెడదామా అని రోజులు లెక్కిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇంటి దగ్గర అమ్మ తనకు ఇష్టమైనవన్నీ అడిగి మరీ వండి పెడుతుంటే.. ఆ రుచికి అలవాటు పడిన వారు హాస్టళ్లలో తిండి తినలేక ఇంటి ఫుడ్ కోసం మొహంవాచిపోయి ఉంటారు.
అలా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి ఇష్టమైనవన్నీ తినేద్దామా అన్న ఆత్రంలో ఉన్న ఓ బాలిక హాస్టల్ నుంచి తన తండ్రి ఫోన్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను ఫలానా రోజున ఇంటికి వస్తున్నాననీ, ఆ రోజుకు తాను పంపిన మెనూ ప్రకారం ఫుడ్ రెడీ చేయమనీ ఆ మెసేజ్ సారాంశం. శ్వేతాంక్ భూషణ్ అనే వ్యక్తి కుమార్తెను హాస్టల్ ఉండి చదువుకుంటోంది. ఐదు నెలల తరువాత శుక్రవారం (డిసెంబర్16) క్రిస్మస్ సెలవుల కోసం ఇంటికి రానుంది. ఈ సందర్బంగా ఆమె తండ్రికి మెసేజ్ చేసింది. తాను సెలవలకు ఇంటికి వస్తున్నాననీ, తనకు సెలవులలో ఏం ఫుడ్ కావాలో ఓ లిస్ట్ పెట్టింది. ఆ లిస్ట్ చూసిన శ్వేతాంక్ భూషణ్ తొలుత షాక్ అయ్యాడు.
ఆ తరువాత కూతురిపై ప్రేమ పొంగుకొచ్చింది. ఆమె కోరినవన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన కూతురు తనకు పంపిన మెసెజ్ ను యథాతథంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. వెంటనే అది వైరల్ అయ్యింది. ఇంతకీ తన తండ్రికి ఆ అమ్మాయి మెసేజ్ చూసిన లిస్ట్.. సెలవుల్లో ఆ అమ్మాయి తినాలనుకుంటున్న ఫుడ్ ఐటెమ్స్. ఆ జాబితా ఏం చిన్నగా లేదండోయ్ చాలా చాలా భారీగా ఉంది. హాస్టల్ తిండి తినలేక రుచికరమైన ఫుడ్ కోసం ఆ అమ్మాయి ఎంతగా తహతహలాడిపోతోందో ఆ లిస్ట్ చూస్తే ఇట్టే అర్దమైపోతుంది.
అందుకే సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయింది. గతంలో నా కుమార్తే ఇలాగే చేసేది.. ఇప్పుడు పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇంటికి వస్తోందంటే ఇలా తనకు కావలసిన ఫుడ్ ఐటెమ్స్ జాబితా పంపుతుంది.. అయితే ఇప్పుడు తన ఒక్కర్తికే కాదు.. భర్త, పిల్లల కోసం కూడా సెపరేట్ లిస్ట్ పెడుతోందని ఓ తండ్రి స్పందించాడు. ఇక విద్యార్థులైతే మేం కూడా అంతే అని కొందరు...ఇక పై మేమూ ఇదే ఫాలో అవుతామని మరి కొందరూ స్పందించారు.