తెలంగాణలో మరో చంద్రోదయం
posted on Dec 27, 2022 7:36AM
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంఛి, ఎలాంటి స్పందన వచ్చిందో ఖమ్మం సభ రుజువు చేసింది. అనూహ్యంగా సభ సక్సెస్ అయింది. అదొక ఎత్తయితే, కేవలం ప్రజల నుంచే కాదు, రాజకీయ పార్టీలు, నాయకుల నుంచి కూడా తెలుగు దేశం పార్టీకి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు లభిస్తోందని నాయకుల ప్రకటనలు సూచిస్తున్నాయి. ఒక విధంగా సెంటిమెంట్ తెర తొలిగి పోయిన నేపథ్యంలో, తెలంగాణలో మరో చంద్రోదయం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
నిజానికి ఇతర పార్టీలలో ఉన్న మాజీ టీడీపీ నేతలు ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టచ్ లోకి వెళ్లి నట్లు సమాచారం. అందులో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ కీలక నేతలుగా చెలామణి అవుతున్న నాయకులు కూడా ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే కారు దిగి సైకిల్ ఎక్కే కొందరి పేర్లు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి చెందిన నేతలు సహా గతంలో తెలుగు దేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న ముఖ్యనేతలు కొదంరు తెలుగు దేశం అడుగులను గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అలాగే బీజేపీలోని టీడీపీ మాజీ నాయకులు పసుపు చొక్కాలు పైకి తీస్తున్నారని అంటున్నారు.
అయితే ఇదంతా ఒకెత్తు అయితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మాజీ తెరాస మంత్రి ఈటల రాజేందర్ టీడీపీ రీఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ రాజకీయాల్లో రీఎంట్రీకి అవకాశం కల్పించారని అన్నారు. అంతే కాదు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు గొప్పగా ఉపయోగించుకుంటారని అన్నారు. తెలంగాణ సక్సెస్ అవుతారని జగ్గా రెడ్డి చెప్పు కొచ్చారు.
మరోవంక బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ వాసన, పునాది రెండు ఉన్నాయని అన్నారు. అలాగే టిడిపి ఏమీ నిషేధించిన పార్టీ కాదని, తెలుగు దేశం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని గతంలో చంద్రబాబు కూడా చెప్పారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఉన్న పార్టీ అని పేర్కొన్న ఈటల దేశంలో ప్రతి పార్టీకి ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంతో టిడిపికి సంబంధం ఉంది కాబట్టే చంద్రబాబు తెలంగాణలో సభలు పెడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు .ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని కూడా అన్నారు. అంతే కాకుండా తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తుకు సంబంధించి ఈటల ఆచి తూచి స్పందించారు.అవునని కాదని అనకుండా, బీజేపీ తెలంగాణలో ఒంటరిగానే విజయం సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే పొత్తుల విషయం ఎలా ఉన్నప్పటికీ తెలుగు దేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు ఆస్కారం కలిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల మాటలు దేనికి సంకేతం అనే చర్చ ఇప్పటికే జోరందుకుంది. ఈటల మాట తీరు, బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, బీజేపీ టీడీపీల మధ్య పొత్తు పొడిచే సంకేతాలు స్పష్టమవుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.
అదెలా ఉన్నప్పటికీ, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. నిజానికి, మొదటి నుంచి కూడా తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ప్రజా బలం, క్యాడర్ నాయకత్వ బలం పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఇంతవరకు తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ చంద్రుడు (కేసీఆర్) ఓ వెలుగు వెలిగారు. జగ్గారెడ్డి అన్నట్లుగా ఇప్పడు కేసీఆర్ స్వయంగా సెంటిమెంట్ కు టాటా చెప్పేశారు. కేసేఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను వదిలేయడంతో తెలంగాణ రాజకీయ ఆకాశంలో మరో స్వయం ప్రకాశిత చద్రోదయం (చంద్రబాబు) అయ్యే సమయం ఆసన్నమైందని పరిశీలకులు అంటున్నారు. అలాగే మరో రెండు మూడు నెలల్లోనే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారి పోతుందని పరిశీలకులు జోస్యం చెపుతున్నారు.