ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సర్కార్ కు డబుల్ షాక్
posted on Dec 26, 2022 @ 11:32PM
ఇటు భారతీయ జనతా పార్టీ, (బీజేపీ) అటు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండు పార్టీల మధ్య, ఇంచుమించుగా సంవత్సరానికి పైగా సాగుతున్న రాజకీయ పోరాటం మరో మలుపు తిరిగింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజీపీని టీఆర్ఎస్ /బీఆర్ఎస్ ఇరకాటంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాష్ట్ర హై కోర్టు, కేసీఆర్ ప్రభుత్వానికి షాకిచ్చింది. కేసు విచారణను సిబిఐకి అప్పగించింది.రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ రాష్ట్రంలో కాలు పెట్టకుండా అడ్డుకునేందుకు జనరల్ కన్సెంట్ రద్దు చేసినా, హై కోర్టు తీర్పుతో ఇప్పుడు సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది. ఇలా రెండు విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు డబల్ షాక్ ఇచ్చింది.
కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం ( సిట్) విచారణ పై విశ్వాసం లేదని, విచారణ పారదర్శకంగా జరగట్లేదని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేసులో నిందితులుగా ఉన్న నంద కుమార్, అనుమానితుడిగా ఉన్న అడ్వకేట్ శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన రాష్ట్ర హై కోర్టు,. కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన తీర్పు నిచ్చింది.
నిజానికి సిట్ దర్యాప్తును బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే సిట్ విచారణపై అనుమానాలున్నాయని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు, హైకోర్టును కోరారు. న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సీబీఐకి ఆర్డర్ చేస్తూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ విచారణ చేస్తోంది. ఇప్పుడు ఈ కేసును హైకోర్టుకు అప్పగించడంతో విచారణను తిరిగి మొదటి నుంచి ఆరంభించే అవకాశం ఉంది.
అధికార టీఆర్‌ఎస్/బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యేలు దీనిపై తమకు ఫిర్యాదు చేశారని.. తమకు డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపించి పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం వల పన్ని ఈ ఆపరేషన్ నిర్వహించాం అని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈకేసు విచారణకు ఏర్పాటు చేసిన ‘సిట్’ ఏర్పాటు విషయంలో మొదటి నంచి అనుమనాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో ఏర్పాటు సెహ్సిన సిట్ కూర్పు, విషయంలో అనుమనాలు వ్యక్తమయ్యాయి. అలాగే, సిట్ అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పద మయ్యాయి. న్యాయ స్థానాలు సైతం సిట్ గీత దాటిందని పేర్కొన్నాయి. కీలక కేసుల్లో సిట్ ఏర్పాటు సాధారణమే అయినా.. డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమించడం రాష్ట్రంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తొలిసారి కావడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి.
ఈ నేపధ్యంలోనే విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదన్న పిటిషర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో సిట్‌ను విచారణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ.. సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఎలాంటి ఆలస్యం లేకుండా కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించింది. కాగా.. హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.