బలవంతపు ఏకగ్రీవాలు చేస్తే ఖబర్దార్! జగన్ కు చంద్రబాబు వార్నింగ్
posted on Jan 28, 2021 @ 1:34PM
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కొత్త వివాదం నెలకొంది. ఏకగ్రీవ ఎన్నికలపై అధికార , విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఏకగ్రీవాల కోసం వైసీపీ ప్రయత్నిస్తుండగా.. అధికార పార్టీ ఎత్తులను తిప్పికొట్టేందుకు టీడీపీ, బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఏకగ్రీవాలు నివారించాలని గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ఎస్ఈసీపైనా ఒత్తిడి పెంచుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో జగన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ చెప్తున్న ఏకగ్రీవాలు ప్రజామోదంతో జరిగినవి కాదన్నారు. దౌర్జన్యాలు, దాడులతో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు. ఇందుకు ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ విధ్వంసాలే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగలేదన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా వివిధ ఘటనలకు సంబంధించిన వీడియోలను మీడియా సమావేశంలో టీడీపీ అధినేత ప్రదర్శించారు. 2014లో 2.6శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే... 2020లో 20శాతం పైగా ఎలా చేయగలిగారని చంద్రబాబు ప్రశ్నించారు. 2014లో ఒక్క జడ్పీటీసీనే ఏకగ్రీవమైతే ఇప్పుడు పదుల సంఖ్యలో ఎలా చేయగలిగారని నిలదీశారు. మొత్తం 2700పైగా దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. 20నెలల్లో ఏం చేసారని ఓటేయాలని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదు ఖబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. .
టీడీపీ హయాంలో అనేక రంగాల్లో నెంబర్ వన్ గా రాష్ట్రాన్ని నిలిపామని చెప్పారు చంద్రబాబు. 25వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు వేస్తే 20నెలల్లో ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్డు వేశారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా ఉందా? అని ప్రశ్నించారు. ఏపీ ఫైబర్ నెట్‌లో చానెళ్లను నిలిపివేసే అధికారం ఎవరిచ్చారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.