కొల్లు రవీంద్రకు బెయిల్.. భయపడేది లేదంటూ వార్నింగ్
posted on Mar 11, 2021 @ 11:12AM
ఉదయం అరెస్ట్. మధ్యాహ్నం బెయిల్. మచిలీపట్నంలో జరుగుతున్న హైడ్రామా మరో టర్న్ తీసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరైంది. కొల్లు రవీంద్ర అరెస్టుతో మచిలీపట్నంలో హైటెన్షన్. బుధవారం పురపాలక ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొల్లు రవీంద్ర, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై 356, 506, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గురువారం ఉదయం మచిలీపట్నంలోని ఆయన నివాసంలో రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం జిల్లా కోర్టుకు తరలించారు. పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడిన న్యాయమూర్తి.. కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేశారు.
అరెస్టులకు భయపడేది లేదని టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేం న్యాయమని అడిగితే నాపైనే కేసు పెట్టారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నరు రవీంద్ర.
పోలింగ్ రోజు మచిలీపట్నంలో హైటెన్షన్ నెలకొంది. ఓటు వేసేందుకు వెళ్లిన తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ మచిలీపట్నం జలాల్‌పేటలోని పోలింగ్ కేంద్రం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు కొల్లు రవీంద్ర. ఓటు వేసేందుకు వచ్చిన రవీంద్రకు, వైసీపీ ఏజెంట్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇనగుదురుపేట సీఐ శ్రీనివాసరావు కొల్లు రవీంద్రను వెళ్లిపోవాలని సూచించడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. తనను చంపేయాలనుకుంటున్నారా అంటూ రవీంద్ర పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గొడవ నేపథ్యంలో రవీంద్రపై కేసు నమోదు చేసి గురువారం ఉదయం ఆయన ఇంటికెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొల్లును కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరైంది.