టీడీపీ, జనసేన మళ్లీ పొత్తు!
posted on Mar 18, 2021 @ 11:28AM
తెలంగాణలో బీజేపీతో కటీఫ్. తిరుపతి పోటీ నుంచి విత్‌డ్రా. ఏదో తేడాగా ఉందంటున్నారు విశ్లేషకులు. జనసేన స్ట్రాటజీ మారిందా? బీజేపీకి రాంరాం చెప్పేందుకు రెడీ అవుతోందా? కమలంతో కయ్యానికి జనసైన్యం ముహూర్తం చూసుకుంటోందా? పాత మిత్రుడు చంద్రబాబుతో మళ్లీ చేయి కలిపేందుకు సన్నద్ధమవుతోందా? అంటే కావొచ్చనే సమాధానమే వస్తోంది. వరుస పరిణామాలను నిశితంగా గమనిస్తే.. జనసేన పొలిటికల్ లైన్ మారిందని.. టీడీపీకి దగ్గర అవుతోందని అంటున్నారు.
తెలంగాణ బీజేపీ తమను అవమానించిందంటూ జనసేనాని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. తెలంగాణలో కమలం పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. ఇక, ఏపీలోనూ ఇదే రిపీట్ అవుతుందని అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తిరుపతిలో పోటీకి ఎంతగా ప్రయత్నించినా.. బీజేపీ నుంచి సహకారం అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతిలో బీజేపీ కంటే జనసేన-బీఎస్పీ కూటమికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా, తిరుపతి సీటును జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ అస్సలు అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే తిరుపతి సీటును వదులుకునేందుకు పవన్ అంగీకరించారట. బీజేపీ తీరుతో విసిగి వేశారిన జనసేనాని.. తెలంగాణలో మాదిరే ఏపీలోనూ కటీఫ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అదే సమయంలో, పాత మిత్రుడు, నమ్మదగిన నాయకుడైన చంద్రబాబుతో జత కట్టే దిశగా ఆలోచన చేస్తున్నారని ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీలు అవగాహనతో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాయి.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్న అనలిస్టులు కూడా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే అధికార పార్టీకి ఇంతటి ఫలితాలు వచ్చేవి కావంటున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య లక్ష ఓట్ల తేడా ఉంది. ఈ జిల్లాలో జనసేనకు 50వేలకు పైగా ఓట్లు వచ్చాయి. నగరంలో 16 డివిజన్లలో జనసేన పార్టీ టీడీపీ గెలుపు అవకాశాలను దెబ్బతీసిందని లెక్కలు వేస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన ఫలితం తారుమారయ్యేదని అంటున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఓట్ల లెక్క లు చూస్తే.. ఈ జిల్లాలో వైసీపీకంటే ప్రతిపక్షాలకు ఎక్కు వ ఓట్లు లభించాయి. విశాఖపట్నం జిల్లాలో వైసీపీ 4.64 లక్షల ఓట్లు సాధించింది. టీడీపీ 3.87 లక్షల ఓట్లు తెచ్చుకుంది. జనసేనకు 82 వేలు దక్కాయి. అంటే... ఈ రెండు పార్టీల ఓట్లను కలిపితే... వైసీపీకంటే ఎక్కువే అవుతాయి. బీజేపీకి 35 వేలు దక్కాయి. ఓట్లు చీలిపోవడంతో వైసీపీకి విజయం దక్కింది. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిలి పోటీ చేస్తే విశాఖ, కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి ఫలితాలు వచ్చేవని లెక్కలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తున్న జనసేన నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారట.
అయితే.. ఎన్నికలు, గెలుపు మాత్రమే తమ లక్ష్యం కాదని.. మార్పే అంతిమమనేది జనసేన సిద్ధాంతం. అయితే.. అందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి.. ఈ లోగా అధికార వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలన్నా.. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై నిలదీయాలన్నా.. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో స్నేహబంధం ఎంతైనా అవసరమని జనసేనకు రాజకీయ మేథావులు సూచిస్తున్నారట. ఇప్పటికే ఏపీకి కేంద్రం మోసం చేస్తుందనే ఆగ్రహంతో ఉన్నారు ఆంధ్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీతో వెళ్లడం కంటే... పాత మిత్రపక్షం టీడీపీతో పొత్తు పెట్టుకుంటనే బెటరని కొందరు జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.