తెలంగాణలో తెలుగుదేశం.. అదే ఆదరణ.. అదే ప్రభంజనం

ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో గత ఎనిమిదిన్నరేళ్లలో నామమాత్రంగానే కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఒక్క ఎన్నికలో గెలిచింది లేదు. ఉన్న నాయకులంతా వేరే వేరే పార్టీలోని జంపింగ్ చేసేశారు. కార్యకర్తలు దిశా నిర్దేశం లేక నిస్తేజంగా మిగిలిపోయారు. ఆ పార్టీ తెలుగుదేశం. తెలంగాణలో తెలుగుదేశం పనైపోయిందన్నవారే అందరూ. చివరకు స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జెండా కనిపించని పరిస్థితి. తెలుగుదేశం ఉనికి తెలంగాణలో నామమాత్రమన్న విశ్లేషణలు వచ్చాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం జోరు తగ్గింది. హైదరాబాద్ సహా తెలంగాణ ప్రతి అభివృద్ధి మలుపులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం చేపట్టిన కార్యక్రమాలు, అవలంబించిన విధానాలూ కారణమని అంతా అంగీకరిస్తారు. రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒక సందర్భంలో స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అయినా తెలంగాణలో తెలుగుదేశం పని అయిపోయిందనే అంతా భావించారు.

అయితే తెలుగుదేశం కార్యకర్తలు చెక్కు చెదరలేదనీ, వారికి దిశా నిర్దేశం చేయడానికి రాష్ట్ర నాయకత్వమే లేదనీ కూడా చెబుతూ వచ్చారు.  ఔను నిజమే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ  తెలంగాణలో దాదాపుగా ఉనికి కోల్పోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు నేతలు అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరగా, మరికొందరు విభజన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. దాంతో తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ పుంజుకోవడంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. పార్టీకి నాయకులు హ్యాండ్ ఇచ్చినా.. కార్యకర్తలు ఇంకా తెలుగుదేశంతోనే ఉన్నారని ఆయన నమ్మారు. ఆ నమ్మకమే నిజమని బుధవారం ఖమ్మంలో జరిగిన తెలుగుదేశం సభ నిరూపించింది. తెలంగాణలో తెదేపా ఎక్కడుందన్న వారికి ఈ సభే సమాధానం చెప్పింది.

ఈ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఎక్కడా ఎవరినీ విమర్శించకుండానే.. తెలంగాణతో తెలుగుదేశం అనుబంధాన్ని గుర్తు చేశారు. విమర్శలు లేవు, పరుష వాక్యాలు లేవు.. ఆయన మాట్లాడిందంతా తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన విజన్ తో సాధించిన ప్రగతి, భవిష్యత్ తరాల ప్రయోజనం గురించి వేసిన బాటల గురించే. అయినా సభకు హిాజరైన అశేష జనవాహిని ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింది.జేజేలు  పలికింది.  తెలంగాణ ప్రగతిలో అడుగడుగునా తెలుగుదేశమే ఉదన్న విషయాన్ని ప్రస్తావించారు. మూడు దశాబ్దాలు ముందు చూపుతో భవిష్యత్ ను నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చాటారు. అసలు తెలుగుదేశం పుట్టిందే తెలంగాణ గడ్డపై అని ఉద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధి చరిత్రలో తెలుగుదేశందే సింహ భాగమని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రగతికి బాటలు వేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఐఎస్బీ హైదరాబాద్ కు రావడానికి కారణం తనేనని చెప్పారు.  బెంగళూరుతో పోటీపడి మరీ ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో అభివృద్ధి చేశామన్నారు. తాను కాలికి బలపం కట్టుకుని మరీ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చానన్నారు. ఇదంతా యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే చేశానన్నారు. తన కృషి వల్లే ఐటీ ఆయుధం మన తెలుగుయువత చేతికి వచ్చిందన్నారు.

సంపద సృష్టించి యువతకు ఉపాధి కల్పించేలా తీసుకు వచ్చిన విషయాన్ని చెప్పారు. కొవిడ్‌కు టీకా కనిపెట్టిన భారత్‌ బయోటెక్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చింది తెలుగుదేశమేనని వివరించారు. నాలుగు దశాబ్దాల తెలుగుదేశం భవిష్యత్  ప్రగతిని పునాదులు వేసిందని, వెస్తుందనీ చెప్పారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అన్నారు. ఆయన తెలుగుజాతి గుండె చప్పుడు. ఆయన విగ్రహం ముందు నిలబడి సంకల్పం చెప్పుకుంటే.. చాలు అది నెరవేరుతుందని చంద్రబాబు అన్నారు. ఇటీవలి కాలంలో మళ్లీ ఉభయ రాష్ట్రాలూ ఎకం అవుతాయంటూ కొందరు చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. బుద్ధి లేని వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. రెండు తెలుగు రాష్ట్రాలూ ఎప్పటికీ కలిసే అవకాశం లేదనని కుండ బద్దలు కొట్టారు.

తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. దేశంలోనే ఆదర్శ రాష్ట్రాలుగా నిలవాలన్నది తెలుగుదేశం అభిమతమన్నారు. తెలుగు రాష్ట్రాలు దేశంలో తొలి రెండు స్తానాల్లో నిలవాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.  ఘనచరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఖమ్మంలో నిర్వహించిన తెలుగుదేశం శంఖారావం  సభ నాంది పలుకుతుందని చెప్పారు.  తానెప్పుడూ అధికారం కోరుకోలేదని..  ప్రజల అభిమానం మాత్రమే కోరుకున్నానన్నారు.

వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు చెప్పారు. వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల నాయకులను తయారు చేశామన్నారు.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందని అడిగే వాళ్లకు ఖమ్మం బహిరంగ సభే సమాధానమిస్తుందని పేర్కొన్నారు.  ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, దుమ్ముగూడెం ప్రాజెక్టులు నిర్మించిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని వివరించారు.  వేర్వేరు కారణాలతో పార్టీని విడిచివెళ్లిన వారంతా మళ్లీ తిరిగి రావాలని ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేకున్నా ఇంత ప్రజాబలం తెదేపాకు ఉందంటే అది కార్యకర్తల వల్లేనన్నారు.   

ఖమ్మం శంఖారావం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించేందుకు తెలుగుదేశం నిర్ణయించింది.  బహిరంగ సభకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనశ్రేణిలో వచ్చిన చంద్రబాబుకు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.  అడుగడుగునా పార్టీ కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.  ఖమ్మంలో జరిగిన సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.