జగన్ ఆశలు ఆవిరి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్  వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు.. అంటే అటు ఇచ్చాపురం నుంచి ఇటు తడ వరకు.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే చంద్రబాబు పోటీ చేసే కుప్పం, నారా లోకేశ్ పోటీ చేసే మంగళగిరితోపాటు జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే.. అన్ని స్థానాలు హోల్ సేల్‌గా ఫ్యాన్ పార్టీ ఖాతాలో గంపగుత్తగా పడిపోతాయంటూ కలలు కంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ సమీక్షా కార్యక్రమంలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ ఇదే మాట పదే పదే చెబుతూ వస్తున్నారు.

నేను బటన్ నొక్కుతూ సొమ్ములు పందేరం చేస్తున్నాను. ఓట్లు మనకు కాక ఇంకెవరికి పడతాయి.. మీరు గడప గడపకూ వెళ్లి నేను చేస్తున్న బటన్ నొక్కుడు సంక్షేమాన్ని వివరించండి అని చెప్పిందే చెబుతూ వస్తున్నారు. కానీ వాస్తవంగా జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు. ఆ పార్టీ పట్ల ఏ స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం పేరుకుపోయింది అన్నది ఆయన గమనించడం లేదు... తన పార్టీ  ఎమ్మెల్యేలు, నాయకులనూ కూడా గమనించొద్దు అంటున్నారు. అయితే జగన్ కంటున్నవన్నీ పగటి కలలేనని తాజా నివేదిక ఒకటి తేటతెల్లం చేసింది. కేంద్రానికి అందిన ఆ నివేదిక ప్రకారం జగన్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల సంగతి అటుంచి ఓ 20 స్థానాలలో గెలవడం కూడా కష్టమేనన్నది ఆ నివేదిక సారాంశం. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ మహా గెలిస్తే ఓ 15 నుంచి 19 స్థానాలలో గెలవవచ్చని కేంద్ర నిఘావర్గాల నివేదిక పేర్కొందని అంటున్నారు. ఆ నివేదికలో జగన్ పార్టీ జాతకం అంతా పక్కాగా ఉందని సమాచారం.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉన్న ప్రజాదరణ.. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లేదని.. దీంతో గత ఎన్నికల నాటితో పోలిస్తే ఆయన గ్రాఫ్   22 శాతానికి పడిపోయిందని..   ప్రస్తుతం ఆయనకు 29 శాతం మేర ప్రజల మద్దతు ఉన్నా..  వచ్చే ఎన్నికల నాటికి ఈ శాతం మరింత తగ్గే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయనీ.. కేంద్ర నిఘా వర్గాల నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. నేను ఉన్నాను.. నేను విన్నానంటూ... ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ 341 రోజుల పాటు చేసిన పాదయాత్రలో ప్రతిరోజు చెప్పిందే .. చెప్పుకొంటూ వెళ్లారు... అలాగే అదే సమయంలో జనాన్ని హామీల సునామీతో ముంచేశారు. కానీ  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. నాడు పాదయాత్రలో వైయస్ జగన్ చెప్పిన దానికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దానికి   ఫొంతన లేదు. ఈ విషయంలో ఇఫ్పటికే ప్రజలు ఓ క్లారిటీకి  వచ్చేశారు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ ఎంత అభివృద్ధి జరిగిందంటే.. అందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని ఆ సదరు నివేదిక స్పష్టం చేసిందని సమాచారం.

అదీకాక వచ్చే ఎన్నికల వేళ.. ప్రజల్లోకి వెళ్లితే.. మేము చేసిన అభివృద్ధి ఇదీ అంటూ.. ప్రజలకు వివరించాల్సి ఉంటుందని... అలా వివరించేందుకు  జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్క అంశం కూడా లేదని... అలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీకీ ఓట్లు పడే అవకాశం అయితే లేవని ఆ నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది.

  మరోవైపు.. గత ఎన్నికల వేళ.. జగన్ విజయం కోసం.. తల్లి,చెల్లే కాదు.. టాలీవుడ్‌లోని పలువురు నటీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు  ముందుకు వచ్చి..  ప్రచారం చేశారని.. దీంతో జగన్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక అయిందని..  కానీ వచ్చే ఎన్నికల వేళ.. వైయస్ జగన్‌కు అంత సీన్   లేదని సదరు నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసులు సైతం ఒక కొలిక్కి రాకుండా.. కొన.... సాగుతోండడంపై ఇప్పటికే..   జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో సందేహాల నీడలు అలుముకున్నాయని... అలాగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి క్రైమ్ రేట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. నెంబర్ వన్ స్థానంలో ఉందని.. ఇక విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి.. కేంద్ర  నుంచి రావాల్సిన వాటిపై పోరాటం చేయకపోవడం.. అలాగే విభజన కారణంగా.... తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సీఎం కేసీఆర్‌ను సైతం వైయస్ జగన్ పెదవి తెరచి అడగకపోవడం వంటి అంశాలు సైతం సదరు నివేదికలో స్పష్టంగా పొందు పరిచి ఉన్నట్లు తెలుస్తోంది. సదరు నివేదిక కేంద్రానికి అందిన విషయం తెలుసుకొన్న అధికార ఫ్యాన్ పార్టీలోని పలువురు కీలక నేతలు.. కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇదే అంశం బయటకు పొక్కి.. సోషల్ మీడియలో సైతం వైరల్ అవుతుండడంతో... నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరి వచ్చే 30 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో నేను సీఎంగా ఉండాలి.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు ఫ్యాన్ పార్టీ రెక్కలపై వాలి పోవాలంటే మాత్రం ఇంకా ఏదో ఒకటి చేయాలని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ఉచిత సలహా అందిస్తున్నారీ నెటిజన్లు. మరి వైయస్ జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.