జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమెకీ వారంట్ ను రాంపూర్ స్పెషల్ కోర్టు జారీ చేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల విచారణ సందర్భంగా ఆమె వరుసగా కోర్టుకు గైర్హాజర్ అవుతూ వచ్చారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆమె హాజరు కాకపోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ సమయానికి ఆమెను కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు ఆదేశిస్తూ జయప్రదపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. 

తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, కన్నడ భాషల్లో 300కు పైగా సినిమాల్లో జయప్రద నటించారు.రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ తదితర హీరోలతో  నటించారు.  సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏపీ ప్రజలకు సేవ చేయాలని భావించినా అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ కు వెళ్లారు. రాంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు.