ఏపీలో దొంగ ఓట్లపై సీఈసీకి తెలుగుదేశం ఫిర్యాదు
posted on Nov 22, 2023 9:22AM
ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లపై తెలుగుదేశం నాయకులు సీఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం అనుకూలుర ఓట్లు తొలగిస్తున్నారనీ, అదే సమయంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారనీ తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రతినిథి బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అలాగు దేశంలో అన్ని రాష్ట్రాలలోనూ ఎన్నికల విధులకు టీచర్లను వినియోగిస్తున్నారనీ, ఒక్క ఏపీలో మాత్రం ఎన్నికల కోసం ప్రత్యేకంగా టీచర్లను వినియోగిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించారనీ ఈ బృందం సీఈసీకి ఫిర్యాదు చేసింది.
గ్రామ సచివాలయ వ్యవస్థ కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతోంని ఆరోపించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఈసీకి వివరించినట్లు తెలుగుదేశం నాయకులు తెలిపారు. అక్టోబర్ 27 వరకు దేశవ్యాప్తంగా ఓటర్ల పరిశీలన కార్యక్రమం జరిగిందనీ, అయితే ఏపీలో మాత్రం ఈ కార్యక్రమం జరగలేదని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫారం 6, 7 , 8 దరఖాస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఒక కుటుంబంలోని వ్యక్తుల ఓట్లను వేర్వేరు బూత్‌లకు కేటాయించిన విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే చనిపోయిన వ్యక్తుల వివరాలు ఆధారాలతో ఇచ్చినా ఓటర్ల జాబితా నుంచి వారి ఓట్లను తొలగించలేదని ఫిర్యాదు చేశారు.
ఒక వ్యక్తికి రెండు ఓట్లన్న జాబితానుఆధారాలతో సహా ఇచ్చినా చర్యలు తీసుకోలేదనీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారనీ తెలుగుదేశం ప్రతినిథి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. సుమారు 160 పోలింగ్ కేంద్రాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయనీ ఆధారాలతో సహా సీఈసీకి తెలిపింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని, గ్రామ సచివాల సిబ్బంది ప్రభుత్వ ప్రచారంలో పాల్గొంటున్నారనీ తెలియజేసింది. గ్రామ సచివాలయ సిబ్బందిని బీఎల్‌వోలుగా నియమిస్తున్నారనీ, వారు ఇంటింటికీ వైసీపీ జెండాలు పట్టుకుని వెళ్లి ప్రచారం చేస్తున్నారనీ ఆరోపించింది. ఏపీలో సొంత వ్యవస్థ ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారి పేర్కొంది. గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల ప్రక్రియలో వాడవద్దని చెప్పినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. అధికార యంత్రాంగమంతా జగన్ కనుసన్నల్లో పనిచేస్తోందని తెలుగుదేశం నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు.