ఎవరి భజన వారిదే
posted on Nov 20, 2013 @ 9:47PM
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఉడతా భక్తిగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగా ముఖ్యమంత్రి పదవి కావాలనుకోవడం ఏమీ తప్పు కాదు. కొందరు సామాజిక న్యాయం ద్వారా అవుదామని ఆశిస్తుంటే, మరి కొందరు ఆత్మాభిమానంతో, వాళ్ళలో బాగా తెలివయిన వాళ్ళు అమ్మ దయతో అవుదామనుకొంటున్నారు. అయితే ఏ న్యాయనికయినా అమ్మ దయ తప్పనిసరిగా అవసరం గనుక అమ్మని ప్రసన్నం చేసుకొనేందుకు అమ్మకు జై! అంటూ అందరూ కలిసి యాత్రలు మొదలుపెట్టేసారు.
కానీ, కేసీఆర్ బూచిని చూపి అధిష్టానం పంపిన జైపాల్ రెడ్డి వారందరికంటే చాలా గట్టిగా తెలంగాణా గురించి మాట్లాడుతుంటే పాపం! ముఖ్యమంత్రి అయితే వేసుకోవచ్చునని ఎప్పుడో సూటు కూడా కుట్టించేసుకొన్న జానారెడ్డి, ముఖ్యమంత్రి అయితే తప్ప గడ్డం గీయనని అమ్మకి మొక్కుకొన్న దామోదరుడు, గీతక్కాయ్ వంటివారు బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండిపోక తప్పడం లేదు.
ఇక్కడ వారందరితో కలిసి అమ్మ భజనలో పాల్గొంటున్నపటికీ, ప్రత్యేకం దర్శనం టికెట్స్ పట్టుకొని డిల్లీలో చక్కర్లు కొడుతున్న సర్వే సత్యనారాయణ ‘నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవలసిందే! అని అమ్మ ఆజ్ఞాపిస్తే కాదనే దైర్యం నాకెక్కడిది?” అని మీడియా ముందు బిక్క మొహం వేసుకొని తన మనసులో మాట చెప్పేసాడు.
అయితే, ఇంతమంది భక్తులలో అందరికీ ముఖ్యమంత్రి పదవులు ఈయలంటే తెలంగాణాని మరో పది రాష్ట్రాలుగా విడదీసినా సరిపోదు గనుక, ప్రస్తుతానికి జైపాల్ రెడ్డికే ఆ వరమేదో ఇచ్చేయవచ్చని సమాచారం. కానీ అప్పుడు ఈ సామాజిక న్యాయవాదులు, అత్మాభిమానులు ఏవిధంగా న్యాయం కోరుతారో చూడాలి.