ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు భిన్నాభిప్రాయాలు
posted on Nov 21, 2013 9:27AM
జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్త మరియు కె.సి.భానులతో కూడిన హైకోర్టు ధర్మాసనం, ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్దం అంటూ దాఖలయిన ప్రజహిత వాజ్యాలపై రెండు విభిన్నమయిన తీర్పులు నిన్న వెలువరించింది.
జస్టిస్ గుప్త పిటిషనుదారుల వాదనలతో ఏకీభవిస్తూ ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్దమేనని ప్రకటించడమే గాకుండా, సమ్మె వలన ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఉద్యోగుల వద్ద నుండి వసూలుచేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు.
అయితే జస్టిస్ భాను మాత్రం దీనితో విభేదించారు. ప్రజాహితం కోసం అంటూ వేసిన పిటిషను కేవలం రాజకీయ ప్రేరేపితమయినది గనుక అటువంటి పిటిషను ఆధారంగా సమ్మె చట్టబద్దమా కాదా? అనే సంగతి తేల్చడం కోర్టు పరిధిలోకి రాదని ప్రకటించారు. పిటిషనుదారులలో ఒకరు గతంలో ఇదేవిధంగా తెలంగాణా కోసం జరిగిన సకల జనులసమ్మెలో పాల్గొన్న విషయాన్ని జస్టిస్ భాను ఈ సందర్భంగా గుర్తుచేసారు.
ఒకే ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ఒక వాజ్యంపై ఈవిధంగా రెండు విబిన్నమైన తీర్పులు ఇచ్చినందున, దీనిపై మూడవ న్యాయ మూర్తి అభిప్రాయం/తీర్పు తీసుకోవాలని ధర్మాసనం నిర్ణయించింది. అందువల్ల మొదటి న్యాయమూర్తి గుప్త ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు మళ్ళీ మూడవ న్యాయమూర్తి తీర్పు వెలువరించేవరకు అమలులోకి రావని ధర్మాసనం ప్రకటించింది.