కాటి కెళ్లాలన్నా.. కట్టె కాలాలన్నా బాదుడే బాదుడు!
posted on Jul 23, 2022 @ 12:50PM
అనాదిగా రాజులకు, ప్రభుత్వాలకు, ధనికవర్గానికి, వ్యాపారులకు సులువుగా చిక్కేది సామాన్యప్రజలే. పచ్చిమిరపకాయ నుంచి పచారీ సామాన్ల వరకూ దేని జోలికి స్వేచ్ఛగా వెళ్లనీయరు. ఏదో రకంగా కనీసం రెండు రూపాయలు అదనంగా కొట్టేద్దామనే అనుకుంటారు. కాలం మారినా, ఆ దాడి ఆలోచనలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు, పేరు మార్చారంతే. ఇంకా చెప్పా లంటే ఆ చట్టబద్ధమైన దోపిడీకి హద్దూ..పొద్దూ లేకుండా పోతోంది. ప్రజలు ఉన్నది పన్నులు కట్టడానికే.. తాము కట్టించు కోవడా నికే అన్నట్లుగా ప్రభుత్వాలు చెలరేగిపోతున్నాయి. ఏదో ఒక సాకుతో అధిక పన్నులు వసూలు చేయడం దేశంలో ఇప్పుడు నిత్యకృత్యమైంది. మరీ ముఖ్యంగా జీఎస్టీతో ఉద్యోగుల జీవితాలను మరింత సంక్లిష్టం చేశారు. సంపాదనలో సగం ఏదో ఒకరకం పన్నులకే పోతోంది. ప్రభుత్వం మీద ప్రజలు విసిగెత్తు తున్నారు. ఏది కొనాలన్నా, తినాలన్నా ప్రభుత్వం దాన్నిగురించి ఏమన్నా అన్నదా అని ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించారు. కేంద్రం కేవలం వ్యాపారసంస్థలు, ఆయా కుటుంబాలకు మాత్రమే కొమ్ము కాస్తోందన్నది ప్రతీ విషయంలోనూ తెలిసిపోతోంది. ఈ రకమైన దోపిడీని దేశంలో సామాన్యులు ఊహించలేదు. చిత్రమేమంటే పెరుగు మీదకూడా ఐదు శాతం పన్ను విధించడం. ఇంతకంటే దారుణాన్ని ఊహించలేం.
ప్రజలంతా ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవడానికి అసలా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇక అనారోగ్యం పాలై ఆస్పత్రికి వెళితే పెద్ద చికిత్స, ఆపరేషన్ అవసరమైతే వాటిని అడ్డుపెట్టుకుని ఆస్ప త్రులు ముందే వాటి ఖర్చు చెప్పి ప్రాణం లాగేస్తున్నారు. ఓట్లు వేయించు కుని గద్దె ఎక్కుతున్నామన్న ఇంగితం కూడా లేకుండా పోతోంది. ఓట్ల సమయంలో అనేక ప్రమాణాలు, హామీల వర్షంలో ముంచెత్తి ఓటరు నవ్వుమొహం చెరిగే లోగా విజేతలై దూరమ వుతున్నారు.
అసలు పన్నులు అతిగా ఎందుకు విధిస్తున్నాము, ప్రస్థతస్థితిలో కట్టేట్టున్నారా లేదా అన్నది ప్రభువుల వారికి బొత్తిగా గిట్టని అంశం. దాన్ని గురించి ఆలోచించమనే అధికారులు, మిత్రులు చెబుతూంటారేమో..కానీ అధికార పార్టీవారికి, ప్రధాని, ముఖ్య మంత్రులకు, ఆర్ధిక మంత్రులకు అవేవీ చెవికి ఎక్కడం లేదు. ఇలాంటివారిని చూసి ప్రజలు ఏడ్వలేక నవ్వుతూ సెటైర్లు వేస్తు న్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రజలను ఎందుకు పిండుకోవాలనుకుంటుందనేది ఎక్కువ మంది ఆవేదన చెందుతున్న మాట. నిజానికి ఇది మొదటిది కాదు.. అలాగని చిట్టచివరిదీ కాదు. ఇంకా ఎన్ని వాతలుంటాయో.. ఎలాంటి వాటి మీద ఉంటా యో చెప్పడం కష్టం. కానీ మధ్య తరగతి జీవి మాత్రం ఈ పన్నుల చక్రబంధంలో ఇరుక్కుని నలిగిపోతున్నాడు. సంపాదిస్తే ఆదాయపు పన్ను.. ఖర్చు పెడితే జీఎస్టీ… పెట్రోల్, డిజిల్ టాక్సులు ఎక్స్ ట్రా ! బతకడానికి ఊపిరి మీద కూడా రేపో మాపో పన్ను విధిస్తే.. సారీ.. ఈ ఆలోచన వారికెందుకు ఇవ్వడం.. చచ్చేదీ సామాన్యలం మనమే!
ఎక్కడ ఎక్కువ వస్తువులు కొని ఆనందిస్తారేమోనని ప్రభుత్వానికి ఈర్ష్య. అవును అందుకే జీఎస్టీ లేని వస్తువంటూ లేదు. బిల్లు వేయని దగ్గర కొన్నా, ఆ వస్తువులో జీఎస్టీ పన్ను కూడా కలిపేసి ఉంటుంది. అంటే, సంపాదించుకున్నదానికి పన్ను కట్టడమే కాకుండా, ఖర్చు పెడుతున్న ప్రతీ దానికి పన్నులు కట్టాలన్నమాట. తినే తిండి దగ్గర్నుంచి ప్రతీ దానికి పన్ను కట్టాలి. ఇవిగాక పెద్దమొత్తంలో ప్రజల్ని దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పన్నులు ఉండనే ఉన్నాయి. దీనికి జీఎస్టీలో చోటు లేదు. అంటే విడిగా పన్నులు బాదేస్తారన్నమాట. దీని ద్వారా కేంద్రానికి ఏటా మూడు, నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే ప్రజల సంపద ఎంతగా పీల్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్రమేమంటే బతకడానికి ఉద్యోగం, పన్నులు కట్టడానికి జీతం అన్నట్టుగా బడుగు జీవుల బతుకులు మార్చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారికోసమే ప్రజలు బతకాలన్నమాట!
ఆలోచించే తీరిక లేకుండా కష్టపడి మధ్యతరగతి ప్రజలు పన్నులు కడుతున్నారు. పాలకవర్గాలతో సన్నిహితంగా ఉన్న వారు మరింత ధనవంతులైపోతున్నారు. ఈ అంతరాలు ఇలా పెరిగిపోతే జరిగేది దేశాభివృద్ధి కాదు.. వినాశనం. ఆ విషయాన్ని సంకుచిత మనస్థత్వం కలిగిన పాలకులు అర్థం చేసుకోడం కష్టం. ప్రజలు అలాంటి వారిని ఆదరించినంత కాలం ఈ పన్నుపోట్లు తప్పవు. ప్రజలు కట్టే పన్నులతో రాజకీయ ఖర్చులు చేసుకోవడం ఆగదు. మనమింతే.. మన పాలకులూ ఇంతే !