చెల్లి చనిపోయిందని..చెల్లితో పాటే చితిలోకి
posted on Jun 20, 2016 @ 5:02PM
తను ప్రాణాలకన్నా మిన్నగా చూసుకునే చెల్లి చనిపోయే సరికి బ్రతకడం అనవసరమని తాను తనువు చాలించే అన్నలను మనం సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ నిజ జీవితంలోనూ చెల్లిలి పట్ల అంతకన్నా ఎక్కువ మమకారాన్ని చూపించే అన్నలున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా పుదుపేట మండలం కొంగరపాళయం గ్రామానికి చెందిన కుమార్, కుమార్ అన్నాచెల్లెల్లు. అతడికి చెల్లెలంటే పంచప్రాణాలు, కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇటీవలే శక్తివేల్ అనే యువకుడికిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. మెట్టినింట ఉన్న చెల్లిల్ని చూడకుండా ఉండలేక తరచూ చూసి వస్తుండేవాడు.
ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా కుమారి శనివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే కుమార్ కుప్పకూలిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలు ఇక లేదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. విచారణ అనంతరం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. అయితే చెల్లిని కడసారి చూస్తూ..చితిలో కాలుతున్న ఆమె శరీరాన్ని చూసి తల్లడిల్లిపోయిన కుమార్ వెంటనే చితిపైకి దూకేశాడు. ఊహించని ఈ సంఘటనతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. వెంటనే కుమార్‌ను బయటికి లాగారు. తీవ్రంగా గాయపడిన కుమార్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.