Read more!

ఒక్కసారి ఇటు చూడండి!

★కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఎందుకుచుకు పంచాయతీ పరిధిలోని జీలగలగండి కాలనీ ఉంది. కాలనీలో  700 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళందరూ మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఉండే బావులతో మంచినీళ్లు బిందెలతో తెచ్చుకుంటారు.

★ఎలూరు జిల్లాలోని 215 పల్లెలకు తాగునీరందించే సత్యసాయి రక్షిత నీ పథకం మూలన పడింది. వింజరం పంచాయతీలో బక్కబండారు గూడెంలో 200 మంది గిరిజనులకు ఆ నీళ్లే దిక్కుగా ఉండేవి. వీళ్ళు 5 కిలోమీటర్ల దూరంలో ఆర్వో ప్లాంట్ కు వెళ్లి నీళ్ల క్యాన్ లు కొనుక్కోచ్చుకుంటారు. ఒకవైవు నీళ్లు, మరోవైపు వెహికల్స్ పెట్రోల్ ఖర్చు.

★ కర్నూలు జిల్లా  ఆస్పరి మండలంలో డి. కోటకొండరి అనే ఊరుంది. అక్కడ మూడు బోర్లున్నా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రభుత్వాలు ట్యాంకర్లతో వాటర్ సప్లై చేయలేదు. అక్కడున్న 2500 దూరంగా ఉన్న పొలాలలో నీళ్లు తెచ్చుకుంటారు. ఒకేసారి ఎనిమిది బిందెలు. రిక్షా లాంటి మూడుచక్రాల బండిలో.

★ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో ప్రయివేడులో 100 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నీటి సదుపాయం మాయమయ్యింది. ఒక బోర్ లో రోజుకు కేవలం గంట సేపు మాత్రమే నీళ్లొస్తాయ్. ఆ గంటసేపులో వందకుటుంబాలు ఇంటికి సరిపడా నీళ్లను పట్టుకోగలరా??

పై విషయాలు అన్నీ ఏంటి న్యూస్ ఛానెల్ లో టెలికాస్ట్ చేసినట్టు వాయిస్ మాత్రమే తక్కువయ్యింది అనిపిస్తుంది ఇవి చదివే అందరికీ. ఇవి కేవలం అక్కడక్కడా నీటికి కొట్టుమిట్టాడుతున్న గ్రామాలు, గ్రామాలలో నివసించే ప్రజల సంగతి మాత్రమే. నీటికోసం ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొందరికి నీళ్ళంటే విలువ తెలియడం లేదు. సరికదా డబ్బు పెడుతున్నాం, నీటి సౌకర్యం ఉంది, కాబట్టే వాడుకుంటాం అనే అహంకార ధోరణికి పోతారు.

కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం వాళ్లకు ఎదో చెయ్యమని వాళ్ళను ఉద్ధరించమని కాదు. అలాంటి పరిస్థితి మనకూ వస్తే!! అనే ప్రశ్న వేసుకోవడం.

రోజూ రెండుపూటలా స్నానాలు, హాయిగా సింక్ టాప్ ఆన్ చేసి అంట్లు కడుక్కోవడం, షవర్ ఆన్ చేసి నీళ్లతో ఆటలు ఆడటం,  నీళ్లను ఇష్టానుసారం  వేస్ట్ చెయ్యడం ఇలా చాలా రకాలుగా నీటి శాతాన్ని తగ్గించేస్తూ ఉన్నాం. పైన చెప్పుకున్నట్టు నీటి కొరత ఏర్పడితే??

కనీసం బిందెలు మోయడం కూడా మర్చిపోయిన పట్టణ ప్రజలలో నీటి ఎద్దడి వచ్చి పడితే, ఉదయం ఎప్పుడో ఆఫీసులకు వెళ్లి రాత్రిప్పుడో ఇంటికి చేరుకునే ఉద్యోగాల మధ్య, ఆడ, మగ అనే తేడా లేకుండా ఉరుకులు, పరుగుల జీవితాలలో కనీసం ఒక్క బిందె నీళ్లు స్వయంగా తెచ్చుకోగలమా??

అప్పుడొకసారి చెన్నై లో నీటికి ఎద్దడి ఏర్పడి చివరికి ట్రైన్లలో నీళ్లను చేరవేసి అక్కడి ప్రజల గొంతులు తడిపిన కథనాలు అందరూ మరచిపోగలరా??  ఉన్నప్పుడు నీటిని సరైన విధంగా జాగ్రత్త చేసుకోకపోతే విదేశాల శైలిలో టాయిలెట్ పేపర్లు, టెంపరరీ వంట పాత్రలు, బట్టలు, ఇతర వస్తువులు ఉపయోగించాల్సి వస్తుందేమో కదా!! 

అసలు ఇవన్నీ తలచుకుంటే చేతిలో ఉన్న ఒక గ్లాస్ నీళ్లే అమృతంలాగా అనిపించేయవూ. వర్షం నీటిని భూమిలో ఇంకెలా చేయడమో, మొక్కల్ని పెంచడం, నీటిని జాగ్రత్తగా వాడుకోవమూ ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తే భవిష్యత్తులు కాస్త బాగానే ఉంటాయి. లేదూ మాకు ఏమి అవసరం అని అంటారా??

సరే పోండి మీ ఖర్మ!! భవిష్యత్తరాలు ఏడుస్తూ ఉంటాయంతే!! ప్రకృతి కూడా మనుషుల స్పందనలకు ప్రతిస్పందలను ఇస్తుంది.

            ◆ వెంకటేష్ పువ్వాడ.