కాంగ్రెస్ పార్టీకి విశాఖ ఎమ్మెల్యే ఝలక్
posted on Feb 8, 2014 @ 10:34AM
వైజాగ్ కాంగ్రెస్ యంయల్యే తైనాల విజయకుమార్ పార్టీకి ‘గుడ్ బై’ చెప్పేసి రేపు వై.కాంగ్రెస్ లో చేరిపోతున్నట్లు తాజా సమాచారం. వైకాపాలో చేరేందుకు ఇంతకాలంగా తటపటాయించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరియు ఆయన అనుచరులు రేపు శ్రీకాకుళంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైకాపా తీర్ధం స్వీకరించనున్నారు. వారితోబాటే తైనాల కూడా వైకాపా తీర్ధం పుచ్చుకోబోతున్నారని తాజా సమాచారం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా మసలిన తైనాల, ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తరువాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ యం.యల్యేలతో బాటు ఆయన కూడా సంతకాలు సేకరణ చేశారు. కానీ, ఆ తరువాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వెళ్లిపోయి వైకాపా స్థాపించినపుడు, వైయస్సార్ అభిమానులు చాలా మంది వైకాపాలోకి వెళ్ళినప్పటికీ తైనాల మాత్రం ఎందుకో ఆ పార్టీలో చేరలేదు.
కానీ, నిన్న కేంద్రం రాష్ట్ర విభజన బిల్లుని ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన తరువాత, ఇంకా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటే, ఆ పార్టీతో బాటు తను కూడా మునగడం ఖాయమని భయపడ్డారో ఏమో, వెంటనే తను కాంగ్రెస్ వీడి వైకాపాలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ధర్మాన, తైనాల వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ వైకాపాలో చేరుతున్నట్లు చెప్పుకోవడం వినడానికి బాగానే ఉంది. కానీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కూటమికి మద్దతు ఇస్తామని చెపుతున్న వైకాపాలోకి చేరడం చూస్తే, వారు రానున్నఎన్నికలలో గెలవడం కోసమే పార్టీ మారుతున్నారు తప్ప, పార్టీని, దాని నిర్ణయాన్ని వ్యతిరేఖించి కాదని అర్ధమవుతోంది.