నాతో పాటు హరీశ్ రావు కూడా లాగాడు.. గవర్నర్ తో రేవంత్ రెడ్డి
posted on Oct 20, 2015 @ 10:30AM
టీటీడీపీ ఫైర్ బ్రాండ్, యువనేత రేవంత్ రెడ్డికి ధైర్య ఎక్కువని అందరికి తెలిసిందే. ఇప్పుడు గవర్నర్ నరసింహన్ కూడా రేవంత్ రెడ్డిని ధైర్యవంతుడని మెచ్చుకున్నారు. ఎందుకంటారా.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు రైతుల ఆత్మహత్యల విషయపంపై అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ ను కలిశారు. ఈనేపథ్యంలో గవర్నర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మొత్తానికి ధైర్యవంతుడివేనని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా రేవంత్ రెడ్డి గవర్నర్ కుర్చీని లాగిన సంఘటనను గుర్తుచేసి ఈ వ్యాఖ్య అన్నట్టు తెలుస్తోంది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు నాతో పాటు హరీశ్ రావు కూడా కుర్చీ లాగారు.. కానీ మీరు హరీశ్ రావును మర్చిపోయి నన్ను మాత్రమే గుర్తుపెట్టుకున్నారు అని సరైన సమాధానమిచ్చాడు. అంతేకాదు రేవంత్ రెడ్డి తరుపున టీడీపీ నేతలు మాట్లాడాలని చూశారు కాని గవర్నర్ మాత్రం.. నా గురించి రేవంత్ రెడ్డికి తెలుసు.. రేవంత్ గురించి నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు.