బైరెడ్డి మళ్ళీ యాక్టివ్ అయినట్లున్నారే?
posted on Oct 20, 2015 9:24AM
రాయలసీమ పరిరక్షణ సమితి అదినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్ర విభజనకి ముందు హైదరాబాద్ లో కొంచెం హడావుడి చేసి రాయలసీమ ప్రజలందరి దృష్టిని ఆకట్టుకొని, సార్వత్రిక ఎన్నికలలో రాయలసీమ వ్యాప్తంగా తన సమితి తరపున అభ్యర్ధులను నిలబెట్టి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలనుకొన్నారు. కానీ ఒక హత్య కేసులో ఇరుక్కోవడంతో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ కేసు సంగతి ఏమయిందో తెలియదు కానీ మళ్ళీ బయటకి వచ్చి హడావుడి చేయడం మొదలుపెట్టారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు చెందినవారయినప్పటికీ సీమకు తీరని అన్యాయం చేస్తున్నారని వాదిస్తున్నారు. రాయలసీమవాసుల కష్టంతో అభివృద్ధి చేసిన హైదరాబాద్ ని ఒక చంద్రుడు (కేసీఆర్) తన్నుకుపోతే, ఇప్పుడు మరో చంద్రుడు (చంద్రబాబు నాయుడు) రాయలసీమకు దక్కవలసిన రాజధానిని విజయవాడకు తరలించి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కనుక రాయలసీమవాసులెవ్వరూ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరుకారాదని, ఒకవేళ వెళ్లిన్నట్లయితే వారు రాయలసీమ ద్రోహులుగా భావిస్తామని హెచ్చరించారు. దసరా పండుగరోజు అంటే అమరావతి శంఖుస్థాపన జరిగేరోజు రాయలసీమ వాసులకు చీకటి రోజని అన్నారు.