తెలంగాణ యోగి ఎక్కడ? బీజేపీ పక్కన పెట్టేసిందా?

 

స్వామి పరిపూర్ణనంద... హిందూధర్మ పరిరక్షణలో దూకుడుగా వెళ్తూ కాంట్రవర్సీ కామెంట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫ్యామస్ అయిన స్వామీజీ. ఇదే బీజేపీ హైకమాండ్ ను ఆకర్షించింది. అంతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో పార్టీలోకి రప్పించి రాష్ట్రమంతా తిప్పారు. పరిపూర్ణానంద కూడా బాగానే హడావిడి చేశారు. తన వాడివేడి ప్రసంగాలతో తెలంగాణ యోగిగా పార్టీ నేతలు కీర్తించేలా చేసుకున్నారు. సొంత హెలికాఫ్టర్‌పై తిరుగుతూ... లక్ష్మణ్‌కు పోటాపోటీగా, సభలు సమావేశాలు, ర్యాలీలతో అనధికార స్టార్ క్యాంపెయినర్‌గా చక్రం తిప్పారు. మతం, జాతీయవాదం పేరుతో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పై ఓ రేంజ్‌లో చెలరేగిపోతూనే... కాంట్రవర్సీ కామెంట్స్ తో కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. దాంతో భవిష్యత్తులో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేది స్వామీజీనే అనుకున్నారు. కానీ ఫలితాల తర్వాత కథ అడ్డం తిరిగింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఉన్న సీట్లను కూడా చేజార్చుకొని ఒక్కసీటుకే పరిమితమైంది. స్వామిజీ తిరిగిన ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. పైగా డిపాజిట్లు కూడా రాలేదు. రాజాసింగ్ సొంత ఇమేజ్‌తో గెలిచాడు. తన ప్రయోగం విఫలం కావడంతో పరిపూర్ణానంద కలత చెందారట. ఇక ఏదేదో ఊహించుకున్న పార్టీ అధిష్టానం కూడా, స్వామిజీ ప్రభావం శూన్యమేనని భావించి, ప్రాధాన్యత తగ్గించిందట. దాంతో స్వామిజీ కూడా పార్టీకి దూరం జరిగారు. 

అయితే, అసెంబ్లీ ఎలక్షన్స్ వెనువెంటనే వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో, అసెంబ్లీ అనుభవంతో, ఒక్క ఎంపీ సీటూ కూడా రాదని స్వామిజీ అంచనా వేశారట. అయితే, ఈసారి కూడా అంచనా తప్పింది. పార్లమెంట్‌ పోరులో, అందరి అంచనాలను తలకిందులుచేస్తూ... నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో మరోసారి అవాక్కవడం స్వామిజీ వంతయ్యింది. ఒకవేళ పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వామిజీ ప్రచారం చేసి ఉంటే, తన వల్లే నాలుగు ఎంపీ స్థానాలు వచ్చాయని చెప్పుకునే అవకాశం దక్కేది. పార్టీలో భవిష్యత్‌ లీడర్‌గా ఒక వెలుగు వెలిగేవారు. కానీ ప్రచారం చేయలేదు కాబట్టి, చెప్పుకునే ఛాన్సే లేకుండా పోయింది. దాంతో, ఇప్పుడెక్కడా కనిపించకుండా సెలైన్స్ మెయింటైన్ చేస్తున్నారట స్వామీజీ.

అయితే, పార్టీకి ఆదరణ లేనప్పుడు పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ పుంజుకుంటున్నప్పుడు పట్టించుకోకపోవడం స్వామిజీకి రుచించడం లేదట. పైగా కొందరు నేతలు పరిపూర్ణానందను అవమానించారని, అందుకే దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే, స్వామీజీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం కొందరు ముఖ్యనేతలకు నచ్చడంలేదనే మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి, పరిపూర్ణానంద పరిస్థితిని తలుచుకుని... పాపం స్వామిజీ అంటున్నారట బీజేపీ కార్యకర్తలు.