సూర్యకుమార్ యాదవ్ (ఎస్ కెవై) చెలరేగిన వేళ!
posted on Jan 8, 2023 7:47AM
సూర్యకుమార్ యాదవ్.. ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ.. శ్రీలకం చేష్టలుడిగి నిలబడిపోయింది. ఫీల్డర్లు బౌండరీ అవతల పడిన బంతిని తీసుకురావడానికే పరిమితమయ్యారు. మిస్టర్ 360 గా మన్ననలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్..ఒంటి చేత్తో శ్రీలకంతో జరుగుతున్న మూడో టి20ని భారత్ ఖాతాలో వేసేశాడు.
దీంతో శ్రీలంకతో టి20 సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలిచింది. ఇక మళ్లీ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విధ్వంసం వద్దకు వస్తే.. శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టి20లో సూర్యకుమార్ యాదవ్ ఏడు ఫోర్లు, 9 సిక్సర్లతో కేవలం 45 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దీంతో టి 20ల్లో మూడు శతకాలు బాదిన నాన్ ఓపెనింగ్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. సూర్యకుమార్ విధ్వంసక బ్యాటింగ్ తో టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
ఈ స్కోరులో సూర్యకుమార్ యాదవ్ స్కోరు 112 (51 బంతుల్లో) నాటౌట్. దీంతో 229 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది.దీంతో టీమ్ ఇండియా 91 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకు ముందు తొలుత టాస్ కోల్పోయి బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కలేదు.
ఓపెనర్ ఇషాన్ కిషన్ తొలి ఓవర్ లోనే వెనుదిరిగాడు. అయితే రాహుల్ త్రిపాఠి బ్యాట్ ఝుళిపించాడు. 35 పరుగులు చేసి త్రిపాఠి వెనుదిరిగిన తరువాత మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు సూర్యకుమార్ యాదవ్. తనదైన స్కూప్ షాట్లతో సూర్యకుమార్ యాదవ్ విరుచుకుపడటంతో మైదానంలో శ్రీలంక ఫీల్డర్లది ప్రేక్షక పాత్రే అయ్యింది. బౌలర్ వేసిన ప్రతి బంతినీ బౌండరీ అవతల నుంచి తీసుకురావడానికే వారు పరిమితమయ్యారా అన్నట్లుగా సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యం కొనసాగింది. స్వల్ప వ్యవధిలో గిల్, హార్దిక్ (4), దీపక్ హుడా (4) వెనుదిరిగినా సూర్య కుమార్ యాదవ్ జోరు కొనసాగించాడు.