జగన్ సర్కార్ కి కేవీపీ వాతలు!
posted on Jan 8, 2023 8:47AM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు పరిచయం అవసరం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత ‘ఆత్మ’ మిత్రుడు. కేవీపీకి వైఎస్సార్ తో ఉన్న ‘ఆత్మ’ బంధం గురించి తెలియని వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉండరు. వైఎస్సార్ ను నడిపించిన వాడు కేవీపీ అన్నది అందరికీ తెలిసియన్ విషయమే. నిజానికి, వైఎస్సార్ తోనే కాదు, ఆయన కుటుంబంతోనూ కేవీకి మిత్ర బంధాన్ని మించిన ఆత్మీయ బంధం వుందనేది అందరూ అనుకునే మాట.
నిజానికి వైఎస్సార్ ఆకస్మిక మృతి తర్వాత కూడా ఆ కుటుంబంలో, కుటుంబ రాజకీయాలలో కేవీపీ కీలక పాత్రే పోషించారు. అయితే ఎప్పుడైతే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కేవీపీ వైఎస్ కుటుంబానికి దూరమవుతూ వచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో సంబంధాలను కేవీపీ పూర్తిగా తుంచేసు కున్నారు. అయితే ఎందుకనో తెలియదు కానీ, వైఎస్సార్ ఆప్తులు ఎవరూ జగన్ రెడ్డికి ‘ఆత్మీయులు’ కాలేక పోయారు.
ఇక ప్రస్తుతానికి వస్తే, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా, కేవీపీ, గడచిన మూడున్నరేళ్ళలో జగన్ రెడ్డి పరిపాలన మంచి చెడుల గురించి పెద్దగా మాట్లాడింది లేదు. కానీ, ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సంస్తాగత మార్పులు జరిగి గిడుగు రుద్ర రాజు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కీవీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలన గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడున్నరేళ్ళలో జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన సుందర ముదనష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేవీపీ, ప్రధానంగా పోలవరం.. ప్రత్యేక హోదా అంశం పైన స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం, బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ధర్మ పోరాటం చేసిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, జగన్ రెడ్డి ప్రభుత్వం, ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాలకు వదిలేసిందని అన్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి చేయాల్సి ఉంటే అటు కేంద్రం..ఇటు రాష్ట్రం ప్రాజెక్టు విషయంలో సరైన వైఖరితో లేవని విమర్శించారు. పోలవరం నిర్వాసితులు నాలుగున్నర లక్షల మందికి జగన్ దారి చూపడం లేదని, కనీసం ప్రోత్సాహకాలు అందించలేని హీన, దీనస్థితిలో ఉన్నారని కేవీపీ అసహనం వ్యక్తం చేశారు. అంచనాలు ఎంతైనా కేంద్రమే పోలవరం పూర్తి చేయాలని కేవీపీ డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత వైఫల్యాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.
నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే, ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు. కేంద్రం దయ మన ప్రాప్తం అన్నట్లుగా చేతులు ఎత్తేశారు.అయితే చేతులు ఎత్తేయ లేదు, కాళ్ళు పట్టుకోలేదు అని చెప్పుకునేందుకో ఏమో, ప్రధానిని కలిసిన ప్రతీ సందర్బంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని తన వినతి పత్రంలో చేరుస్తున్నారు. అటు కేంద్రం పార్లమెంట్ వేదికగా ఇప్పటికే పలు మార్లు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ నేత కేవీపీ ఇదే అస్త్రాన్ని తెర మీదకు తెచ్చారు.అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని, జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
అదెలా ఉన్నా, జగన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీవీపే గళం విప్పడం ఇప్పడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి కేవీపీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి వాతలు పెట్టడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజుల క్రితం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ జగన్ రెడ్డి ప్రభుత్వంపై కేవీపీ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కేవీపీ వ్యాఖ్యానించారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఏపీలో ప్రస్తుత పాలన సరైన దిశలో సాగటం లేదని అభిప్రాయపడ్డారు. విభజన హామీల కోసం ప్రభుత్వం నుంచి పోరాటం లేదని వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన విధానంలో వెళ్లటం లేదని కేవీపీ చెప్పుకొచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం సిద్దపడిందన్నారు. అయినా, అడ్డుకొనే ప్రయత్నాలు జరగటం లేదని ఆవేనద వ్యక్తం చేసారు. నాడు వైఎస్సార్ రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం, రాహుల్ ను ప్రధాని చేయటం ఆ రెండు లక్ష్యాలుగా కేవీపీ గుర్తు చేశారు. కాగా, ఏపీ రాజకీయాలలో కేవీపీ క్రియాశీలంగా మారడం, అది కూడా ఆప్త మిత్రుడు వైఎస్ పేరున వైఎస్ కుమారుడు జగన్ రెడ్డి స్థాపించిన పార్టీ, (వైసీపీ) ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.