మాఫియాడాన్ ఇందర్జీత్ నివాసంపై ఈడీ దాడులు.. భారీగా నగదు, బంగారం సీజ్
posted on Jan 2, 2026 8:16AM
అండర్ వరల్డ్ డాన్ ఇందర్జీత్ సింగ్ యాదవ్, అతని అనుచరుల నివాసాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో లెక్కలలో చూపని 5 కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన బంగారం, 35 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇందర్జీత్, అతడి అనుచరుల నివాసాలపై జరిపిన సోదాలలో మొత్తం 48 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాలు సోమవారం (డిసెంబర్ 29)న ఆరంభమై, బుధవారం (డిసెంబర్ 31) అర్దరాత్రి దాటే వరకూ కొనసాగాయి. ఇందర్జీత్ నివాసంలో స్వాధీనం చేసుకున్న కరెన్సీని లెక్కించేందుకు బ్యాంకు అధికారులను నోట్ల లెక్కింపు యంత్రంతో సహా పిలిపించారు. రాజకీయ అండతో ఇందర్జీత్ సింగ్ యాదవ్ బెదరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇందర్జీత్ యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
హరియాణాకు చెందిన ఇందర్జీత్ సింగ్ యాదవ్ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. అతడు యూఏఈ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండేవాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఇందర్జీత్ యాదవ్, అతడి అనుచరులపై హర్యానా, యూపీ రాష్ట్రాల్లో 15కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆయుధాల చట్టం, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసి, ఛార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. ఈ యాదవ్ అక్రమ సంపాదన వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించే దిశగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది.